COVID19: కరోనా బెడ్​ పై నుంచే కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్​ సందేశం

Shashi Tharoor Gives Message From Covid Sick Bed
  • వ్యాక్సిన్లను ఫ్రీగా ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్
  • డిసెంబర్ నాటికి అందరికీ టీకాలన్న వ్యాఖ్యలపై వ్యంగ్యం
  • టీకాల కొరత ఉంటే ఎలా పూర్తి చేస్తారని ప్రశ్న
ఏప్రిల్ లో కరోనా బారిన పడిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కరోనా బెడ్ పై నుంచే ఆయన తాజాగా ఓ సందేశాన్నిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానాలపై విమర్శలు గుప్పించారు. రెండు నిమిషాల వీడియోలో ‘‘భారత్ ను కరోనా నుంచి కాపాడండి.. అందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా వేయండి’’ అంటూ సందేశమిచ్చారు.

‘‘నేను చాన్నాళ్ల నుంచి కొవిడ్ సమస్యలతో బాధపడుతున్నాను. డిసెంబర్ నాటి కల్లా అందరికీ వ్యాక్సిన్ వేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను చూసి అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడున్న కొరతతో డిసెంబర్ కల్లా కేంద్రం అందరికీ టీకాలను ఎలా ఇస్తుంది? అని నాకు ఆశ్చర్యం వేస్తోంది’’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ విధానాలను కేంద్రం మార్చేలా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి తాను పూర్తి మద్దతునిస్తున్నానని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరల్లో టీకాలను సమకూర్చుకోవడంపై శశిథరూర్ మండిపడ్డారు. అందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి.. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ధరలతో పోటీ పెడతారా? అని ప్రశ్నించారు. కేంద్రానికి తక్కువ ధరకే వ్యాక్సిన్లను కొనే అవకాశమున్నప్పుడు.. కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇవ్వొచ్చు కదా? అని సూచించారు.

టీకా కార్యక్రమం మొదలైనప్పుడు ఉన్న విధానాలనే ఇప్పుడూ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను బాధపడినట్టే తన తోటి ప్రజలు బాధపడకుండా ఉండాలంటే.. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లను ఇవ్వాలని అన్నారు.
COVID19
Congress
Shashi Tharoor

More Telugu News