'నరకాసురన్' రిలీజ్ ఓటీటీలోనే!

02-06-2021 Wed 11:40
  • కార్తీక్ నరేన్ దర్శకత్వంలో 'నరకాసురన్'
  • నిర్మాతగా గౌతమ్ మీనన్
  • ఆర్ధిక సమస్యల కారణంగా జాప్యం
  • సోనీ లైవ్ ద్వారా రిలీజ్
Narakasuran movie will be released in OTT

తమిళ యువ దర్శకులలో కార్తీక్ నరేన్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన తొలి చిత్రంగా వచ్చిన 'ధృవంగల్ పతినారు' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2016లో వచ్చిన ఈ సినిమా, తెలుగులో '16' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్ లో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేవారు ఉన్నారు. బలమైన స్క్రీన్ ప్లేతో నడిచే ఈ సినిమా, చివరివరకూ సస్పెన్స్ తో సాగుతుంది. ఈ సినిమా చూసే కార్తీక్ నరేన్ దర్శకత్వంలో గౌతమ్ మీనన్ 'నరకాసురన్' సినిమాను నిర్మించాడు.

ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా, గౌతమ్ మీనన్ కి గల ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా విడుదల ఆలస్యమైంది. మూడేళ్లు అవుతున్నా ఈ సినిమా రాకపోవడంతో ఇక విడుదల కాదనే అనుకున్నారు. కానీ గౌతమ్ మీనన్ తనకి గల ఆర్ధికపరమైన సమస్యలను ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఓటీటీలో రిలీజ్ అయ్యేలా చూసుకున్నాడు.

'సోనీ లైవ్' ద్వారా ఈ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కానున్నట్టు చెబుతున్నారు. సందీప్ కిషన్ .. అరవింద్ స్వామి .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను 'నరకాసురుడు' పేరుతో పలకరించనుంది.