కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన సురేశ్ బాబు

02-06-2021 Wed 11:05
  • చిన్న సినిమాలకి పెరుగుతున్న ఆదరణ
  • కొత్త దర్శకులకు లభిస్తున్న అవకాశాలు
  • సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి మరో చిన్న సినిమా
Suresh Babu gave a chance to new director

ఇటీవల కాలంలో పెద్ద నిర్మాతలంతా చిన్న సినిమాల కోసం మరో బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని మరీ చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. మరి కొందరు నిర్మాతలు పెద్ద బ్యానర్ల పైనే చిన్న సినిమాలను చేస్తున్నారు. కొత్త దర్శకులు చెప్పిన కథలను వింటూ .. కథ నచ్చితే చాలు, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దాంతో కొత్త దర్శకులకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. అల్లు అరవింద్ .. దిల్ రాజుతో పాటు సురేశ్ బాబు కూడా కొత్త దర్శకులను పరిచయం చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.

రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన సతీశ్ అనే యువకుడు .. సురేశ్ బాబును కలిసి ఒక కథను వినిపించాడట. ఆ కథ కొత్తగా .. విభిన్నంగా ఉండటంతో సురేశ్ బాబు ఓకే చెప్పేశారని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో రానా నటిస్తాడా? అభిరామ్ చేస్తాడా? లేదంటే బయట హీరోతో ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తమని తాము నిరూపించుకోవాలనుకుంటున్న యువ దర్శకులకు ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి.