Kannababu: ఇన్ని మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ కనిపించరు: ఏపీ మంత్రి కన్నబాబు

Minister Kannababu lauds CM Jagan
  • నిన్న 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన
  • టీడీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్న కన్నబాబు
  • ఇలాంటివి టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యలు
  • యనమలపై విమర్శనాస్త్రాలు
ఏపీ సీఎం జగన్ నిన్న ఒక్కరోజే 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడంపై మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకేసారి ఇన్ని మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరని కన్నబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంత మంచి పనులు చేస్తుంటే, ఆయనకు ఎంతో పేరొస్తుంటే.... విపక్ష టీడీపీ ప్రజలను తప్పుదారి పట్టించే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పక్కదోవ పట్టించే విధానాలు టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

సీఎం జగన్ నిన్న మెడికల్ కాలేజీల శంకుస్థాపన చేసినప్పుడే ... టీడీపీ తప్పకుండా విమర్శలు చేస్తుందని తాము ఊహించామని, అనుకున్నట్టుగానే చంద్రబాబు కుడిభుజం యనమల రామకృష్ణుడు, చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ ఈ ఉదయం విమర్శలకు తయారయ్యారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. గతంలో ఏపీని అభివృద్ధి చేశామంటూ నీతులు చెబుతున్న యనమల... చంద్రబాబు అవినీతిలో ఏ విధంగా భాగస్వాములయ్యారో తమకు తెలుసని అన్నారు.

యనమల ఇప్పుడొచ్చి మూలధన వ్యయాలు ఎలా ఉండాలి? అప్పులు ఎలా తేవాలి?  అని చెబుతున్నారని, ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.68 వేల కోట్లు తినేసిన వైనాన్ని అందరం చూశామని, దీన్ని మూలధన వ్యయం అంటారా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. నాడు చంద్రబాబు దోపిడీ గురించి యనమలకు తెలియదని అనుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజలను ఆ విధంగా మోసం చేసినందువల్లే మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారని కన్నబాబు టీడీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Kannababu
Jagan
Medical Colleges
Chandrababu
Yanamala
Nara Lokesh
Andhra Pradesh

More Telugu News