COVID19: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 9,346 మంది పిల్లలు

Over 9300 children lost parents or were abandoned in pandemic NCPCR informs Supreme Court
  • సుప్రీం కోర్టుకు వెల్లడించిన బాలల హక్కుల కమిషన్
  • తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన 1,742 మంది చిన్నారులు
  • తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లలు 7,464 మంది
కరోనా కారణంగా 9,346 మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారని సుప్రీం కోర్టుకు పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) తెలియజేసింది. వారందరి సంక్షేమం కోసం ఆరంచెల పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల వివరాలను ఇప్పటికే బాల స్వరాజ్ పోర్టల్ లో అప్ లోడ్ చేశామని వెల్లడించింది.

అందులో 1,742 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోగా, 7,464 మంది తల్లి లేదా తండ్రిని కోల్పోయారని, 140 మంది అనాథలుగా మిగిలిపోయారని పేర్కొంది. 1,224 మంది పిల్లలు సంరక్షకుని అధీనంలో పెరుగుతున్నారని, 985 మందిని కుటుంబ సభ్యులే సంరక్షిస్తున్నారని తెలిపింది. 6,612 మంది తల్లి లేదా తండ్రి వద్ద ఉంటున్నారని చెప్పింది. 31 మందిని ప్రత్యేక దత్తత కేంద్రానికి పంపినట్టు పేర్కొంది.

అత్యధికంగా మధ్యప్రదేశ్ లో 318 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారని, 104 మంది అనాథలుగా మిగిలారని తెలిపింది. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా 1,830 మంది పిల్లలు తల్లి లేదా తండ్రిని కోల్పోయారని పేర్కొంది. మొత్తంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్లో 3 ఏళ్ల లోపు వారు 788 మంది ఉన్నారని చెప్పింది. 4 నుంచి 7 ఏళ్ల లోపు వారు 1,515 మంది, 8 నుంచి 13 ఏళ్ల మధ్య ఉన్న వారు 3,711 మంది, 14 నుంచి 15 ఏళ్ల వారు 1,620 మంది, 16 నుంచి 17 ఏళ్ల వారు 1,712 మంది పిల్లల తల్లిదండ్రులను కరోనా కాటేసిందని వివరించింది.
COVID19
Children
Abandoned
Supreme Court
NCPCR

More Telugu News