Jagan: ఏపీపై పంజా విసురుతున్న బ్లాక్ ఫంగస్.. పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి!

  • రాష్ట్రంలో 1,179 బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు
  • ఇప్పటి వరకు 14 మంది మృతి
  • మందులు, ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశం
Black Fungus spreading in Andhra Pradesh

ఇప్పటికే కరోనా వైరస్ తో సతమతమవుతున్న ఏపీపై బ్లాక్ ఫంగస్ కూడా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో ఫంగస్ పై ముఖ్యమంత్రి జగన్ అత్యున్నత సమీక్షను నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,179 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. వీరిలో 1,068 మందికి వైద్యం అందుతోందని... 97 మంది ఫంగస్ నుంచి కోలుకున్నారని చెప్పారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

కరోనా లేని వారికి కూడా బ్లాక్ ఫంగస్ వస్తోందని... ఇలాంటి వారు రాష్ట్రంలో 40 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. డయాబెటిస్ తో బాధపడుతున్నవారు ఎక్కువగా ఈ ఫంగస్ బారిన పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ కీలక ఆదేశాలను జారీ చేశారు.

బ్లాక్ ఫంగస్ సోకిన వారికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. దీనికి సమాధానంగా అధికారులు మాట్లాడుతూ... ఇంజెక్షన్లు కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ఆధారంగానే రాష్ట్రానికి వస్తున్నాయని, మందులను మాత్రం అవసరమయినంత మేరకు సిద్ధం చేసుకుంటున్నామని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంజెక్షన్ల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

More Telugu News