SV Prasad: మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో కన్నుమూత

  • కరోనా బారినపడిన ప్రసాద్ కుటుంబం
  • ఇంకా విషమంగానే ప్రసాద్ భార్య ఆరోగ్యం
  • ముగ్గురు సీఎంల వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రసాద్
Ex CS SV Prasad Passed Away with corona

కొవిడ్ బారినపడి ఆసుపత్రిలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆయన కుటుంబం మొత్తం మహమ్మారి బారినపడింది.

దీంతో వారంతా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రసాద్ పెద్ద కుమారుడు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, చిన్న కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రసాద్ దంపతుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ఇటీవల తెలిపాయి. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. ప్రసాద్ భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం.

1975 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రసాద్ నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్‌గా కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత కడప, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్‌గానూ పనిచేశారు. అనంతరం పలు ప్రభుత్వ విభాగాలకు చైర్మన్‌గా, కార్యదర్శిగా, ముఖ్యకార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. రోశయ్య హయాంలో సీఎస్‌గా పనిచేశారు.

More Telugu News