Dilip Vengsarkar: ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచేందుకు కోహ్లీ సేనకు ఇంతకంటే మంచి అవకాశం రాదు: వెంగ్ సర్కార్

Former captain Dilip Vengsarkar opines on Team India chances in England tour
  • ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న భారత జట్టు
  • తొలుత న్యూజిలాండ్ తో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్
  • ఆపై ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్
  • భారత జట్టు సమతూకంతో ఉందన్న వెంగీ
స్వింగ్ కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్ లపై టెస్టు మ్యాచ్ లు ఆడడం విదేశీ జట్లకు ఏమంత సులువు కాదు. ముఖ్యంగా, స్పిన్ పిచ్ లపై ఎక్కువగా ఆడే భారత్ వంటి జట్లు కూడా ఇంగ్లండ్ గడ్డపై ఏమంత మెరుగైన రికార్డు నమోదు చేయలేకపోయాయి.

ఈ నేపథ్యంలో, సుదీర్ఘమైన పర్యటన కోసం టీమిండియా ఇంగ్లండ్ వెళుతోంది. న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు, ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ కూడా ఆడనుంది. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం దిలీప్ వెంగ్ సర్కార్ తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్ నెగ్గడానికి కోహ్లీ సేనకు ఇదే మంచి అవకాశం అని పేర్కొన్నారు. బ్యాటింగ్ పరంగానే కాకుండా, టీమిండియాకు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దళం ఉందని వివరించారు. స్థాయికి తగ్గట్టుగా ఆడితే భారత బ్యాటింగ్ లైనప్ ను నిలువరించడం ఏ జట్టుకైనా కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయం సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, యువ ఆటగాళ్లు ప్రతికూల పరిస్థితుల్లో తామేంటో నిరూపించుకున్నారని తెలిపారు. ఇంగ్లండ్ తో సిరీస్ వారికో మంచి అవకాశమని పేర్కొన్నారు.

అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో మాత్రం న్యూజిలాండ్ కే అవకాశాలు ఉంటాయని వెంగీ పేర్కొన్నారు. జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుండగా, ఆ మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ టీమ్ తో రెండు టెస్టులు ఆడుతుందని, దాంతో సరైన ప్రాక్టీసుతో కివీస్ ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్ కు సిద్ధమవుతారని వివరించారు. కానీ భారత ఆటగాళ్లు నేరుగా బరిలో దిగాల్సి రావడం కొద్దిగా ప్రతికూలాంశమని అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
Dilip Vengsarkar
Team India
England Tour
New Zealand
WTC Final

More Telugu News