Australia: ఐపీఎల్ నిలిచిపోయిన ఇన్నాళ్లకు ఇంటికి చేరుకున్న ఆసీస్ క్రికెటర్లు

  • మే 3 నుంచి నిలిచిపోయిన ఐపీఎల్
  • భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
  • మాల్దీవులకు వెళ్లిన ఆసీస్ క్రికెటర్లు
  • 10 రోజుల క్వారంటైన్
  • ఆపై సొంతగడ్డ మీద సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్
Aussies cricketers arrives their homes after hardcore quarantine

భారత్ లో కరోనా విజృంభించడంతో ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయింది. మే 2న చివరి మ్యాచ్ జరగ్గా, పలు జట్లలో కరోనా వ్యాప్తి చెందడంతో టోర్నీ వాయిదా వేశారు. అయితే, ఇతర జట్ల క్రికెటర్లు ఎలాగోలా స్వదేశాలకు చేరుకోగా, ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం సొంతగడ్డపై అడుగుపెట్టేందుకు 4 వారాలు ఆగాల్సి వచ్చింది. భారత్ లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, భారత్ నుంచి వచ్చే విమానాలను ఆస్ట్రేలియా నిషేధించడంతో ఆసీస్ క్రికెటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ క్రమంలో వారు మొదట మాల్దీవులకు వెళ్లి 10 రోజులు క్వారంటైన్ లో గడిపి, అక్కడ్నించి ఆస్ట్రేలియా వెళ్లి రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆసీస్ క్రికెటర్ల క్వారంటైన్ నిన్నటితో పూర్తి కాగా, కుటుంబ సభ్యులను కలుసుకున్న తర్వాత వారి ఆనందం అంతాఇంతా కాదు. సుదీర్ఘ విరామం, కఠిన క్వారంటైన్ల తర్వాత అయినవారిని కలుసుకున్న ఆనందక్షణాలను వారు ఫొటోల రూపంలో పంచుకుంటున్నారు.

కాగా, మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ ను యూఏఈ గడ్డపై పూర్తిచేయాలని బీసీసీఐ నిర్ణయించుకోవడం తెలిసిందే. సెప్టెంబరు 18, లేక, సెప్టెంబరు 19వ తేదీన గానీ ఐపీఎల్ 14వ సీజన్ పునఃప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లకు ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చేది కష్టమే. అత్యంత గడ్డు పరిస్థితుల నడుమ సొంతగడ్డకు చేరుకున్న వారు, మళ్లీ ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటామోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించే ప్యాట్ కమ్మిన్స్ తాను అందుబాటులో ఉండడంలేదని ఇప్పటికే స్పష్టం చేశాడు. ఐపీఎల్ లో ఆడే మిగతా ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా కమ్మిన్స్ బాటలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News