COVID19: సీరమ్​ సీఈవోపై కేసు.. టీకా వేసుకున్నా యాంటీబాడీలు రాలేదంటూ లక్నో వ్యక్తి ఫిర్యాదు!

Lucknow Man Plaints Against Serum CEO Adhar Poonawalla
  • ఐసీఎంఆర్ డైరెక్టర్ సహా ఉన్నతాధికారులపైనా కేసు
  • ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తే ప్లేట్ లెట్లు తగ్గాయని ఆరోపణ
  • ఎఫ్ ఐఆర్ నమోదు చేయని పోలీసులు
  • కోర్టుకు వెళ్తానని హెచ్చరించిన ఫిర్యాదుదారు
కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నా యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) ఉత్పత్తి కాలేదని ఆరోపిస్తూ సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలాపై లక్నోకు చెందిన ప్రతాప్ చంద్ర అనే వ్యక్తి కేసు పెట్టాడు. ఆయనతో పాటు డీసీజీఏ డైరెక్టర్, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణా ఉపాధ్యాయ్ ల పేర్లనూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఏప్రిల్ 8న తాను కొవిషీల్డ్ మొదటి డోసు టీకా తీసుకున్నానని, ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు తీసుకోవాల్సి ఉన్నా గ్యాప్ ను కేంద్రం ఆరు వారాలకు పెంచిందని ప్రతాప్ చంద్ర చెప్పాడు. ఆ తర్వాత దానిని 12 వారాలకు పెంచిందని గుర్తు చేశాడు. ఒక్క డోసు తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ చెప్పినా.. తనకు మాత్రం ఏమంత మంచిగా అనిపించట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ప్రభుత్వ అనుమతి ఉన్న ల్యాబ్ లో పరీక్ష చేయించుకుంటే యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని తేలిందని వెల్లడించాడు. దానికి బదులు తన ప్లేట్ లెట్లు (రక్త ఫలకికలు) 3 లక్షల నుంచి లక్షన్నరకు పడిపోయాయని చెప్పాడు. దీంతో తనకు కరోనా ముప్పు మరింత పెరిగిందని ఆరోపించాడు.

పోలీసులు అతడి నుంచి ఫిర్యాదు తీసుకున్నా.. ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదు. సున్నితమైన విషయం కావడంతో ఉన్నతాధికారులకు దీనిపై సమాచారమిచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఎఫ్ ఐఆర్ నమోదు చేయకుంటే తాను కోర్టుకు వెళతానని ప్రతాప్ చంద్ర హెచ్చరించాడు.
COVID19
Covishield
Adhar Poonawalla
Uttar Pradesh

More Telugu News