COVID19: కొవిషీల్డ్​ సింగిల్​ డోస్​, వేర్వేరు టీకాలు కలిపి డబుల్​ డోస్​.. మరో నెలలో ట్రయల్స్​!

  • కేంద్ర ప్రభుత్వం కసరత్తులు
  • రెండున్నర నెలల్లో ట్రయల్స్ పూర్తి
  • వీటి కోసం ప్రత్యేకంగా యాప్
Indias New Vaccine Plan To Study Mixing Doses Covishield Single Shot

ఒక సంస్థకు చెందిన టీకా వేసుకున్న వారు.. రెండో డోసు కూడా అదే సంస్థ టీకాను వేసుకోవాలి. ఇప్పటిదాకా ఉన్న విధానం ఇది. అయితే, ఇకపై రెండు డోసులు రెండు వేర్వేరు టీకాలు వేసే విధానంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అంతేగాకుండా, కొవిషీల్డ్ ను ఒకే ఒక్క డోసును ఇచ్చే అంశంపైనా సమాలోచనలు జరుపుతోంది. నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్, టీకాల కొరత వంటి కారణాల నేపథ్యంలోనే ఈ దిశగా కేంద్రం చర్యలు చేపడుతోందని తెలుస్తోంది.

రెండు వేర్వేరు టీకాల డోసులను ఇవ్వడానికి సంబంధించి మరో నెలలో ట్రయల్స్ మొదలయ్యే అవకాశం ఉందని, ఆ ట్రయల్స్ లో దాని ప్రభావ శీలతను తెలుసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు లేదా రెండున్నర నెలల్లో ఆ ట్రయల్స్ ను పూర్తి చేస్తారని అంటున్నాయి. అదే సమయంలో కొవిషీల్డ్ సింగిల్ డోస్ పైనా ట్రయల్స్ జరుగుతాయని చెబుతున్నారు.

ఆ ట్రయల్స్ కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. రెండు వేర్వేరు టీకా డోసులు ఇవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాలను అందులో నమోదు చేయడం సులభం అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఆ యాప్ ను కొవిన్ తో అనుసంధానిస్తారని, తద్వారా టీకాలు వేసుకున్న వారు తమకు కలిగిన అసౌకర్యాన్ని తెలియజేయడమూ సులువు అవుతుందని అంటున్నారు.

కొవిషీల్డ్ సింగిల్ షాట్ తోనూ మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఇటీవలి అధ్యయనాల్లో తేలడంతో ఆ దిశగా ట్రయల్స్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్ లైట్ వంటి టీకాలను సింగిల్ డోస్ లో ఇస్తున్నారు. ఆ రెండు టీకాలూ కొవిషీల్డ్ ఫార్ములా ఆధారంగా తయారైనవే. దీంతో వాటి బాటలోనే కొవిషీల్డ్ సింగిల్ డోస్ పైనా కేంద్రం కసరత్తులు చేస్తోందట.

More Telugu News