Lakshadweep: కాషాయ ఎజెండా అమలు చేసే కుట్ర: లక్షద్వీప్​ పై తీర్మానానికి కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

  • ప్రఫుల్లా ఖోడా పటేల్ ను తొలగించాలని డిమాండ్
  • లక్షద్వీప్ సంస్కృతిని నాశనం చేస్తున్నారని మండిపాటు
  • ప్రజలను అణచివేస్తున్నారన్న సీఎం విజయన్
Attempt to impose saffron agenda Kerala assembly passes resolution to remove Lakshadweep administrator

లక్షద్వీప్ లో కాషాయ ఎజెండాను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేరళ ప్రభుత్వం మండిపడింది. కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ల ఖోడా పటేల్ ను తొలగించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

లక్షద్వీప్ అభివృద్ధి కోసం ఇటీవల ప్రఫుల్ల ఖోడా పటేల్.. ఓ ముసాయిదాను రూపొందించారు. దాని ప్రకారం అక్కడ మద్య నిషేధాన్ని ఎత్తేశారు. తీర ప్రాంత చట్టాన్ని ఉల్లంఘించారని తీరంలోని మత్స్యకారుల షెడ్లను తొలగించారు. బీఫ్ వంటకాలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసే పేరుతో లక్షద్వీప్ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. బ్రిటీష్ పాలన కన్నా దారుణంగా ప్రస్తుతం లక్షద్వీప్ లో ప్రజలు అణచివేతకు గురవుతున్నారని అన్నారు. లక్షద్వీప్ లో కాషాయ ఎజెండాను అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ముందుగా అక్కడి కొబ్బరి చెట్లకు కాషాయ రంగును వేశారని, ఇప్పుడు ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News