Sanjay Raut: భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ ప్రజలకు ఏంచేయలేకపోయింది: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

  • మోదీ పాలనకు ఏడేళ్లు
  • విమర్శనాత్మకంగా స్పందించిన సంజయ్ రౌత్
  • అభివృద్ధి చేయాల్సింది చాలా ఉందని వెల్లడి
  • ఎన్డీయే పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు
  • శివసేన పాఠాలు తమకు అక్కర్లేదన్న బీజేపీ
Sanjay Raut slams BJP

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. రెండో పర్యాయం భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ ఇప్పటివరకు ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని అన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాగా, కరోనా కట్టడి కోసమే సమయం అంతా గడచిపోయిందని, ఇక ప్రజలకు ఏంచేస్తుందని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమం దిశగా చేయాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కోరుకుంటున్నది నిత్యావసరాలు మాత్రమేనని, అంతకుమించి వారేం కోరుకోవడంలేదని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఏంచేశారో ఎన్డీయే పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ఎన్డీయే సర్కారు మోదీ నాయకత్వంలో ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ కాస్తంత సామరస్యపూర్వక ధోరణిలోనే విమర్శలు చేసినా, బీజేపీ మాత్రం తీవ్రస్థాయిలో స్పందించింది.

తమకు శివసేన పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ నేత రామ్ కదమ్ ఘాటుగా బదులిచ్చారు. నిత్యం రంగులు మార్చే పార్టీ మాకు హితబోధ చేస్తోంది అని విమర్శించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఆశయాలను తుంగలో తొక్కారంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏంజరుగుతోందో అర్థంకాని స్థితిలో ప్రజలు ఉన్నారని శివసేన భావిస్తోందా అని ప్రశ్నించారు. సంజయ్ రౌత్ కూడా కేంద్రం అభివృద్ధి పథకాలను ప్రశంసించినవాడేనని, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి రంగులు మార్చేశారని రామ్ కదమ్ మండిపడ్డారు.

More Telugu News