Chinna Jeeyar Swamy: ఆనందయ్య మందు వల్ల ఎవరికీ నష్టం జరగనప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు?: చిన్నజీయర్ స్వామి

Chinna Jeeyar Swamy comments on Aanandaiah corona medicine
  • ఆనందయ్య కరోనా ఔషధం పంపిణి నిలిపివేత
  • అధ్యయనం చేస్తున్న ఆయుష్ శాఖ
  • అసంతృప్తి వ్యక్తం చేసిన చిన్నజీయర్ స్వామి
  • మంచిని ప్రోత్సహించడంలో తప్పులేదని వెల్లడి
  • అసూయతో నిషేధించాలనుకోవడం సరికాదని వ్యాఖ్యలు
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామి ఏపీలో చర్చనీయాంశంగా మారిన ఆనందయ్య కరోనా మందుపై స్పందించారు. ఆనందయ్య కరోనా మందుపై ప్రజల్లో నమ్మకం ఉన్నప్పుడు అడ్డుకోవద్దని స్పష్టం చేశారు. ఆనందయ్య మందు వల్ల ఎవరికీ నష్టం జరగనప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఆ మందు వల్ల దుష్ఫలితాలేవీ ఉండవనుకుంటున్నామని తెలిపారు. ఆ మందుకు ధ్రువీకరణ పత్రాలు కావాలని పట్టుబడితే, ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని అన్నారు.

"ఇక్కడ మంచినే చూద్దాం. మంచిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే తప్పులేదు కదా. కిందపడినవాడ్ని పైకి లేపేందుకు చేయందించేవారిని ఆపి, నీ వద్ద పైకిలేపగలిగే సత్తా ఉందా? ఆ విషయం నిరూపించే సర్టిఫికెట్లు ఉన్నాయా? అని అడిగితే, కిందపడ్డవాడు ఈలోపే పోతాడు! మంచి పనిని ప్రోత్సహించడంలో తప్పులేదు. ఆనందయ్య అనే మహానుభావుడు ఇప్పటివరకు అనేకమందికి ఔషధం ఇవ్వగా, అందరూ సంతోషంగానే ఉన్నారు కదా. ఒకవేళ ఆనందయ్య ఇచ్చేది పసరు మందే అనుకోండి... దానివల్ల మీకొచ్చిన నష్టం ఏంటి? అందులో కెమికల్స్ ఏమీ లేవు కదా, ఎవరినీ నాశనం చేయడంలేదు కదా! కానీ, ఆనందయ్య మందుపై అసూయతో, వ్యతిరేక భావంతో నిషేధించాలనడం సరికాదు" అని చిన్నజీయర్ స్వామి హితవు పలికారు.
Chinna Jeeyar Swamy
Anandaiah
Corona Medicine
Andhra Pradesh

More Telugu News