Chandrababu: చంద్రబాబు ఎత్తుగడలు ఇక పారవు... మాకు జనసేన ఉంది: విష్ణువర్ధన్ రెడ్డి

  • రెండ్రోజుల పాటు సాగిన టీడీపీ మహానాడు 
  • విమర్శలు కురిపించిన బీజేపీ నేతలు
  • బీజేపీతో పొత్తుకు చంద్రబాబు పాకులాడుతున్నారని వ్యాఖ్యలు
  • ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసేది లేదన్న దేవధర్
  • జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్న విష్ణు
BJP leaders slams Chandrababu

చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ రెండ్రోజుల పాటు మహానాడు నిర్వహించగా, బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ బీజేపీ సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ వ్యాఖ్యానిస్తూ... 2024లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడిపోతున్న విషయం మహానాడు ద్వారా వెల్లడైందని తెలిపారు. అయితే, ఏపీలో సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ నాయకత్వంలోని బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే జగన్, చంద్రబాబులకు చెందిన అవినీతి, కుటుంబ పాలన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతాయని స్పష్టం చేశారు.

దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఎత్తుగడలు ఇక పారవని స్పష్టం చేశారు. తమకు ఇప్పటికే జనసేన వంటి నమ్మకమైన పార్టీతో భాగస్వామ్యం ఉందని, ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో పోరాడతామని ఉద్ఘాటించారు.

అంతకుముందు, సునీల్ దేవధర్ తన ట్వీట్ లో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దివంగత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్టే చంద్రబాబు ప్రధాని మోదీని కూడా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కానీ, మోదీ సత్తాను తక్కువగా అంచనా వేసి భంగపడ్డాడని విమర్శించారు. 2024లో బీజేపీతో కలిసి సాగాలన్న చంద్రబాబు మోసపూరిత ప్రణాళిక ఉద్దేశం వెనుక టీడీపీని విచ్ఛిన్నం కాకుండా నిలిపి ఉంచే ఉద్దేశం దాగివుందని దేవధర్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ దీన్ని అంగీకరించదని స్పష్టం చేశారు. తాము ఏపీలో టీడీపీతోనూ, వైసీపీతోనూ పోరాడతామని చెబుతూ బీజేపీ వైఖరిని వెల్లడించారు.

More Telugu News