Vijayashanti: సోషల్ మీడియా నియంత్రణపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంది: విజయశాంతి

  • డిజిటల్ మీడియా నియంత్రణకు కొత్త నిబంధనలు
  • కేంద్రం చర్యపై విమర్శలు
  • కేంద్రానికి మద్దతు పలికిన విజయశాంతి
  • చైనాలో సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపారని వెల్లడి
Vijayasanthi welcomes union government new rules for social media

సోషల్ మీడియా ద్వారా దేశ శాంతిభద్రతలను దెబ్బతీసే వారిని కట్టడి చేయడానికి కేంద్రం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నట్టు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి తెలిపారు. అభ్యంతరకర పోస్టులు చేసే వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టుల సమాచారాన్ని దర్యాప్తు సంస్థలతో పంచుకోవాలని కొత్త డిజిటల్ నియమావళిలో కేంద్రం పేర్కొన్నదని తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరంగా తెలిపారని విజయశాంతి వెల్లడించారు. వ్యక్తిగత వివరాల భద్రతకు భంగం కలగకుండా ఉండేందుకే కేంద్రం సోషల్ మీడియా సంస్థలకు కొత్త నిబంధనలు జారీ చేసిందని కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు.

అయితే, సోషల్ మీడియాకు తాజా నిబంధనలు విధించిన కేంద్ర ప్రభుత్వాన్ని కొందరు విమర్శిస్తున్నారని, ఇవే సోషల్ మీడియా కంపెనీలపై పొరుగుదేశం చైనా ఏవిధంగా ఉక్కుపాదం మోపిందో వారు గమనించాలని సూచించారు. తన సొంత సోషల్ మీడియా సైట్లనే ఉపయోగించాలంటూ ఏవిధంగా కట్టడి చేసిందో తెలియదా? అని ప్రశ్నించారు. దీని గురించి ఒక్కరూ మాట్లాడరని విజయశాంతి విమర్శించారు.

మనదేశంలో ఉన్నంత భావప్రకటన స్వేచ్ఛ ఇంకెక్కడా లేదని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ భద్రత విషయంలోనూ రాజీపడేలా కొన్ని వర్గాలు వ్యవహరించడం నిజంగా దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలని తాను గతంలో ఎన్నోమార్లు చెప్పానని, ఈ దిశగా సరైన నిర్ణయం తీసుకున్న కేంద్రాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.

More Telugu News