ఎస్పీ అగ్రనేత ఆజంఖాన్ పరిస్థితి విషమం

29-05-2021 Sat 15:36
  • లక్నోలో చికిత్స పొందుతున్న ఆజంఖాన్
  • ఏప్రిల్ 30న ఆజంఖాన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ
  • ఆజంఖాన్ పై 100కు పైగా కేసులు
SP leader Azam Khans condition critical
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్ అంటే ఒక పవర్ సెంటర్. ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి ప్రారంభిస్తే... ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రయాణం ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఇప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారని లక్నోలోని మేదాంత ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

ఇటీవల ఆజంఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన సీతాపూర్ జైల్లో ఉన్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఆయనకు జైల్లోనే చికిత్స అందించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆయనను ఈనెల 9న లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆజంఖాన్ తో పాటు అదే జైలులో వున్న ఆయన కుమారుడు అబ్దుల్లా ఖాన్ కు కూడా కరోనా సోకింది. ఈ నెల 9న ఆజంఖాన్ తో పాటు ఆయన కొడుకును కూడా అంబులెన్సులో మేదాంత ఆసుపత్రికి తీసుకువెళ్లారు.  

తండ్రీకొడుకులిద్దరికీ ఏప్రిల్ 30న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆజంఖాన్ పై 100కు పైగా కేసులు ఉండటం గమనార్హం. ఆయన తనయుడిపై కూడా పలు కేసులు నమోదై వున్నాయి.