Malaysia: పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. తమిళనాడు మాజీ మంత్రిపై వర్ధమాన నటి ఫిర్యాదు

  • మా మధ్య ఐదేళ్లపాటు రిలేషన్‌షిప్ కొనసాగింది
  • మణికందన్‌కు అప్పటికే పెళ్లయినా నన్ను చేసుకుంటానన్నాడు
  • పెళ్లి చేసుకుందామంటే దేశం విడిచి వెళ్లాలని బెదిరిస్తున్నాడన్న నటి శాంతిని 
  • ఆమె ఎవరో కూడా తనకు తెలియదన్న మాజీ మంత్రి
Malaysian actor complains against ex Minister Manikandan

తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎం.మణికందన్‌పై మలేసియాకు చెందిన భారత సంతతి మహిళ, తమిళ నటి శాంతిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ మధ్య ఐదేళ్లపాటు ‘రిలేషన్‌షిప్’ కొనసాగిందని, ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని నటి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, తాను గర్భవతిని అయిన తర్వాత మోసం చేశాడని ఆరోపించింది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినందుకు తనను, మలేసియాలో ఉన్న తన కుటుంబాన్ని బెదిరించాడని పేర్కొంది.

‘నాదోడిగల్’ సినిమాలో నటించిన శాంతిని మలేసియా టూరిజంలో పనిచేస్తున్న సమయంలో తరచూ చెన్నై వచ్చేది.  2017లో తమిళనాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న సమయంలో శాంతినితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె వద్ద మంత్రి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పటికే ఆయనకు పెళ్లయినప్పటికీ తనను వివాహం చేసుకుంటానని మాటిచ్చారని, దాంతో ఇద్దరం కలిసి బీసెంట్ నగర్‌లో ఓ ఇంట్లో ఉండేవాళ్లమని ఆమె తెలిపింది.

మణికందన్ తనతో కలిసి ఉన్నారని చెప్పేందుకు సాక్ష్యాలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో తాను మూడుసార్లు గర్భవతిని అయ్యానని, అయితే అధికారికంగా పెళ్లి చేసుకున్న తర్వాతే పిల్లల్ని కందామని అబార్షన్ చేయించాడని శాంతిని పేర్కొంది. ఇప్పుడు దేశం విడిచి వెళ్లకపోతే ప్రైవేటు ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడని పేర్కొంది. అయితే, శాంతిని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని మణికందన్ కొట్టిపారేశారు.

More Telugu News