Andhra Pradesh: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలకు దిగిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు

  • కరోనా వేళ అధిక ఫీజూలు వసూలు చేస్తున్న పలు ఆసుపత్రులు
  • కొరడా ఝుళిపించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
  • పదింతల జరిమానా వేస్తామన్న ఏపీ
  • లైసెన్స్ రద్దు చేస్తామన్న తెలంగాణ
AP and Telangana governments decides to take stern action on private hospitals

కరోనా సంక్షోభ సమయంలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ఏపీ, తెలంగాణ తీవ్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించాయి. ప్రైవేటు ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీని అరికట్టేందుకు ఏపీ సర్కారు జీవో నెం.256ని తీసుకువచ్చింది. కొవిడ్ చికిత్సలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు మించి అదనంగా వసూలు చేస్తే పదింతల జరిమానా విధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను రెండోసారి కూడా ఉల్లంఘిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రైవేటు ఆసుపత్రులను హెచ్చరించింది.

అటు, తెలంగాణ ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేస్తున్న 64 ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించి, షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటిలో ఒక్క కూకట్ పల్లి ఓమ్నీ ఆసుపత్రిపైనే 6 ఫిర్యాదులు రాగా, బేగంపేటలో విన్ ఆసుపత్రిపై 5 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి ఇష్టంవచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తే లైసెన్సులు రద్దు చేసేందుకు వెనుకాడబోమని ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాగా, నోటీసులు అందుకున్న ఆసుపత్రుల్లో కిమ్స్, కాంటినెంటల్, సన్ షైన్, అపోలో (హైదర్ గూడ), లోటస్, కేర్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి.

More Telugu News