సైనా, కిదాంబి టోక్యో ఒలింపిక్ ఆశలకు గండికొట్టిన కరోనా

28-05-2021 Fri 17:54
  • ర్యాంకింగ్స్ లో వెనుకబడిన సైనా, కిదాంబి
  • టాప్-16లో ఉన్నవాళ్లకే ఒలింపిక్స్ బెర్తులు
  • 22వ స్థానంలో సైనా, 20వ ర్యాంకులో కిదాంబి
  • జూన్ 15తో ముగియనున్న అర్హత టోర్నీల గడువు
  • వాయిదాపడిన మలేసియా టోర్నీ 
Corona ends Saina and Kidambi chances of Tokyo Olympics
జపాన్ లో జరిగే టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న భారత బ్యాడ్మింటన్ తారలు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ల ఆశలు గల్లంతయ్యాయి. ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే వారిద్దరూ మెరుగైన ర్యాంకింగ్స్ పొందాల్సి ఉండగా, ఇప్పట్లో క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు ఏవీ లేకపోవడంతో వారికి తీవ్ర నిరాశ తప్పలేదు. టోక్యో వెళ్లే భారత ఒలింపిక్ బృందంలో వారికి చోటు దక్కలేదు.

బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఒలింపిక్స్ లో పాల్గొనే ప్రతి దేశానికి గరిష్ఠంగా రెండు బెర్తులు ఉంటాయి. అయితే, టాప్-16 ర్యాంకింగ్స్ లో ఉండే ఆటగాళ్లకే ఒలింపిక్స్ బెర్తులు లభిస్తాయి. కానీ, మహిళల సింగిల్స్ విభాగంలో సైనా 22వ ర్యాంకులో ఉండగా, పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ 20వ ర్యాంకులో ఉన్నాడు.

వీరిద్దరూ మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆడి తమ ర్యాంకులు మెరుగుపర్చుకోవాలని భావించారు. కానీ మలేసియాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో టోర్నమెంట్ ను వాయిదా వేశారు. ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే జూన్ 15 లోగా ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. అప్పటివరకు మరే ఇతర టోర్నీలు లేకపోవడంతో సైనా, కిదాంబి ఒలింపిక్స్ కు వెళ్లే దారులు పూర్తిగా మూసుకుపోయాయి. దీనిపై ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) స్పష్టమైన ప్రకటన చేసింది.

ఈ నేపథ్యంలో, టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత్ తరఫున పీవీ సింధు (7వ ర్యాంకు), సాయిప్రణీత్ (13వ ర్యాంకు) మాత్రమే ప్రాతినిధ్యం వహించనున్నారు.