Narendra Modi: తుపాను ప్రభావిత రాష్ట్రాలకు రూ.1000 కోట్ల సాయం ప్రకటించిన ప్రధాని మోదీ

PM Modi announced thousand crore assistance for cyclone affected states
  • యాస్ తుపాను ధాటికి ఒడిశా, బెంగాల్ లో బీభత్సం
  • ఝార్ఖండ్ లోనూ నష్టం
  • ఏరియల్ సర్వే చేపట్టిన ప్రధాని మోదీ
  • ఒడిశా, బెంగాల్ సీఎంలతో సమావేశం
  • కేంద్రం నుంచి మరింత సహకారం అందిస్తామని హామీ
యాస్ తుపాను విలయం సృష్టించిన ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అనంతరం, తుపాను ప్రభావిత రాష్ట్రాలకు తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రటించారు. ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు ఈ మేరకు ఆర్థికసాయం అందించనున్నారు. తుపానుతో దెబ్బతిన్న రాష్ట్రాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

పూర్తిస్థాయిలో తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందని పీఎంఓ వెల్లడించింది. నేడు ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని కలైకుంద ఎయిర్ బేస్ లో భేటీ అయ్యారు. వీరిద్దరూ 15 నిమిషాల పాటు తుపాను నష్టంపై చర్చించారు.

అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ, యాస్ తుపాను వల్ల బెంగాల్ కు జరిగిన నష్టంపై ప్రధానికి నివేదిక ఇచ్చానని తెలిపారు. బెంగాల్ కు తుపాను సాయం కింద రూ.20 వేల కోట్లు కోరినట్టు మమత వెల్లడించారు. దిఘా, సుందర్ బన్ అభివృద్ధికి కూడా నిధులు కోరినట్టు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు ఏరియల్ సర్వే చేపడుతున్నట్టు ఆమె వివరించారు.
Narendra Modi
Odisha
West Bengal
Jharkhand
Cyclone Yaas

More Telugu News