IPH: కరోనా కొన్ని తరాల పాటు మనతోనే ఉంటుంది: ఐపీహెచ్ డైరెక్టర్ జీవీఎస్ మూర్తి

  • గ్రామీణ ప్రాంతాల్లోకి కరోనా చొచ్చుకుపోయిందన్న మూర్తి
  • అంటువ్యాధుల్లో ఇది సహజమేనని వెల్లడి
  • సాధారణ ఫ్లూ మాదిరే కరోనా మారిపోతుందని వ్యాఖ్యలు
  • నవంబరులో కరోనా థర్డ్ వేవ్!
IPH director GVS Murthy opines on corona pandemic in India

హైదరాబాదులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐపీహెచ్) డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీఎస్ మూర్తి భారత్ లోని కరోనా పరిస్థితులపై స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లోకి సైతం చొచ్చుకుపోతున్న కరోనా మహమ్మారి రాబోయే మరికొన్ని తరాల పాటు మనతోనే ఉంటుందని అన్నారు. అంటువ్యాధులకు సంబంధించి ఇది చాలా సాధారణమైన విషయం అని అభిప్రాయపడ్డారు. అంటువ్యాధి ఒకసారి ప్రబలితే, క్రమంగా అది స్థానిక వ్యాప్తి కింద మారి, సాధారణ ఫ్లూ తరహాలో అనేక ఏళ్ల పాటు కొనసాగుతుందని జీవీఎస్ మూర్తి వివరించారు.

కాగా, భారత్ లో నవంబరులో కరోనా థర్డ్ వేవ్ రావొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే, 30 ఏళ్లకు పైబడినవారిలో 80 శాతం మందికి టీకాలు ఇస్తే కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చని అన్నారు. కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు దేశంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు జరపడం వల్లే సెకండ్ వేవ్ ప్రమాదకరంగా పరిణమించిందని అభిప్రాయపడ్డారు.

భారత్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సెకండ్ వేవ్ సంకేతాలు వెలువడ్డాయని, కానీ, ప్రజారోగ్య వ్యవస్థ సరైన రీతిలో స్పందించలేదని వెల్లడించారు. ఇతర దేశాల్లో ప్రజారోగ్య వ్యవస్థలు స్పందిస్తుంటే, దురదృష్టం కొద్దీ మనదేశంలో రాజకీయ ప్రతిస్పందనలే వినిపిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News