Twitter: ఢిల్లీలోని తమ కార్యాలయాలపై పోలీసుల దాడులపై ట్విట్టర్ స్పందన

  • ఇండియాలోని తమ ఉద్యోగుల గురించి ఆందోళన చెందుతున్నాం
  • కరోనా సమయంలో కూడా సమాజసేవలో మావంతు పాత్రను పోషించాం
  • భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మకమైన చర్చలు జరుపుతాం
Twitter responds on police raids on its offices in Delhi

ఢిల్లీ, గురుగ్రామ్ లలోని తమ కార్యాలయాలపై పోలీసులు సోదాలు నిర్వహించడంపై ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. టూల్ కిట్ వివాదానికి సంబంధించి ఈ కార్యాలయాలపై పోలీసులు సోదాలు నిర్వహించారు. దీనిపై ట్విట్టర్ స్పందిస్తూ... ఇండియాలోని తమ ఉద్యోగులు, వాక్ స్వాతంత్య్రంపై తాము ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది. భారత ప్రజలకు సేవ చేసే విషయంలో ట్విట్టర్ ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తోందని చెప్పింది.

కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రజలకు తాము అండగా ఉన్నామని, సమాజసేవలో తమ వంతు పాత్రను పోషించామని ట్విట్టర్ తెలిపింది. తమ సేవలను రాబోయే కాలంలో కూడా కొనసాగించేందుకు... భారత చట్టాల ప్రకారం ముందుకు సాగుతామని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా తాము చేస్తున్న విధంగానే... ఇండియాలో కూడా తమ సేవలను పూర్తి పారదర్శకతతో కొనసాగిస్తామని... ప్రతి ఒక్కరి గొంతుకను తమ ద్వారా వినిపిస్తామని తెలిపింది. చట్టాలను అనుసరిస్తూ, వాక్ స్వాతంత్ర్యాన్ని పరిరక్షిస్తామని చెప్పింది.

ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల తాము ఆందోళన చెందుతున్నామని ట్విట్టర్ తెలిపింది. కొత్త ఐటీ నిబంధనలు తమకు ఇబ్బందికరంగా మారాయని చెప్పింది. బహిరంగ చర్చల ద్వారా తాజా పరిణామాలపై చర్చిస్తామని తెలిపింది. భారత ప్రభుత్వంతో కూడా నిర్మాణాత్మకమైన చర్చలు జరుపుతామని వెల్లడించింది. ప్రజల ఆకాంక్షలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, ఐటీ పరిశ్రమ, సివిల్ సొసైటీపై ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు కొత్త ఐటీ నిబంధనలను పాటించడానికి కనీసం మూడు నెలల గడువు ఇవ్వాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖను ట్విట్టర్ కోరింది.

More Telugu News