పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వాలని డబ్ల్యూహెచ్ఓ సూచించలేదు: కేంద్రం

27-05-2021 Thu 16:02
  • బాలలకు కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం స్పందన
  • ఇప్పటిదాకా ఏ దేశంలోనూ ఇవ్వలేదని వెల్లడి
  • చిన్నారులకు టీకాపై అధ్యయనం జరుపుతున్నట్టు వివరణ
  • విదేశీ వ్యాక్సిన్లకు తాము అనుకూలమేనన్న కేంద్రం
Union govt responds on vaccination for children
త్వరలోనే పిల్లలపైనా కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు ఏ దేశంలోనూ బాలలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వలేదని తెలిపింది. చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసింది. పిల్లలకు కొవిడ్ టీకాలు ఇచ్చే అంశంపై అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించింది.

ఇక, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ అంశంపైనా కేంద్రం వివరణ ఇచ్చింది. దేశంలో విదేశీ టీకాలకు అనుమతించడం లేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని పేర్కొంది. ఇతర దేశాల వ్యాక్సిన్ల విషయంలో సానుకూలంగా ఉన్నామని స్పష్టం చేసింది. అమెరికా, బ్రిటన్, జపాన్ ఆమోదించిన వ్యాక్సిన్లకు, డబ్ల్యూహెచ్ఓ సమ్మతి తెలిపిన వ్యాక్సిన్లకు భారత్ లో అనుమతి ఉందని వెల్లడించింది. వ్యాక్సిన్ల విషయంలో నిత్యం రాష్ట్రాలను సంప్రదిస్తున్నామని వివరించింది.