Sexual Offence: నేరానికి ముందునాటి పరిస్థితిని తీసుకురాలేం.. మానసిక భద్రత మాత్రం కల్పించగలం: ఢిల్లీ హైకోర్టు

  • గతేడాది ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి
  • రూ. 50 వేల తక్షణ నష్టపరిహారం ప్రకటించిన ట్రయల్ కోర్టు
  • తీర్పును కొట్టేసి పరిహారాన్ని ఆరు లక్షలకు పెంచిన న్యాయస్థానం
  • నేరాన్ని చెరిపెయ్యడం మన వ్యవస్థకు సాధ్యం కాదన్న కోర్టు
Cant undo sexual offence can give psychological security with compensation to victim Delhi HC

ఆరేళ్ల బాలుడిపై గతేడాది జరిగిన లైంగిక దాడి కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరానికి ముందునాటి పరిస్థితిని తాము తీసుకురాలేకపోయినా కచ్చితంగా మానసిక భద్రత మాత్రం కల్పించగలమని భరోసా ఇచ్చింది. కేసును విచారించిన న్యాయస్థానం బాధిత బాలుడికి 6 లక్షల రూపాయలను తాత్కాలిక నష్టపరిహారంగా ప్రకటించింది.

రూ. 50 వేలు తాత్కాలిక నష్టపరిహారంగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా కొట్టివేసింది. ఇది చాలా తక్కువని, కనీసం మధ్యంతర దశలోనైనా దీనిని పెంచి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నేరానికి ప్రాయశ్చిత్తం కోసం నష్టాన్ని సాధ్యమైనంత వరకు ఆర్థికంగా భర్తీ చేసేలా ఉండాలని పేర్కొంది. బాలుడు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడని, అతడి పసి మనసుపై భావోద్వేగపరమైన కళంకం ఏర్పడిందని న్యాయస్థానం పేర్కొంది.

గడియారాన్ని వెనక్కి తిప్పి నేరాన్ని చెరిపెయ్యడం మన వ్యవస్థకు సాధ్యం కాదు కాబట్టి నేరస్థుడిని విచారించడం, ఆర్థిక సాయం రూపంలో బాధితుడికి మానసిక భద్రతను కల్పించడం, సాధికారతా భావాన్ని కల్పించడం మాత్రమే కోర్టు చేయగలదని స్పష్టం చేసింది. నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది.

More Telugu News