అడివి శేష్ 'మేజర్' విడుదల వాయిదా!

26-05-2021 Wed 10:51
  • షూటింగు దశలో 'మేజర్'
  • కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
  • త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటన
Major movie release date postponed
మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. అతని సినిమాలు ఆసక్తికరమైన కాన్సెప్ట్ లతో రూపొందుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'మేజర్' రూపొందుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 2వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు రావడం లేదు.

కరోనా కారణంగా ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగు జరుపుకోలేకపోయింది. షూటింగు విషయంలో వచ్చిన గ్యాప్ ప్రభావం సహజంగానే విడుదల తేదీపై పడుతుంది. అందువలన ఈ సినిమాను ముందుగా చెప్పిన సమయానికి విడుదల చేయలేకపోతున్నారు. కరోనా పరమైన జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. సయీ మంజ్రేకర్ .. శోభితా ధూళిపాళ్ల .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.