Sileru River: సీలేరు నదిలో పడవల బోల్తా ఘటన.. ఆరుగురి మృతి

  • తెలంగాణ నుంచి స్వగ్రామాలకు బయలుదేరిన 35 మంది వలస కూలీలు
  • క్వారంటైన్ నుంచి తప్పించుకునేందుకు నాటు పడవలపై ప్రయాణం
  • తొలి విడతలో 17 మంది క్షేమంగా ఆవలి ఒడ్డుకు
  • రెండో విడతలో మునిగిన పడవలు
  • మృతుల్లో ఐదుగురు చిన్నారులు.. ఆరేళ్లలోపు వారే
Six killed in boat capsize in Sealeru river

సీలేరు నదిలో సోమవారం రాత్రి రెండు నాటు పడవలు మునిగిన ఘటనలో ఆరుగురు జల సమాధి అయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. మరో మహిళ, చిన్నారి గల్లంతయ్యారు. నిన్న రాత్రి వరకు వారిద్దరి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఒడిశాలోని కందగుడ, గుంటవాడ గ్రామాలకు చెందిన మూడు కుటుంబాలు మూడు నెలల క్రితం తెలంగాణకు వలస వెళ్లి సంగారెడ్డి ప్రాంతంలోని ఓ ఇటుకబట్టీలో పనికి కుదిరారు. తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో స్వగ్రామాలకు పయనమయ్యారు. సోమవారం రాత్రి 35 మంది సీలేరు చేరుకున్నారు.

అయితే, ఇతర రాష్ట్రాల నుంచి ఒడిశాకు వచ్చే వారికి కొవిడ్ నెగటివ్ రిపోర్టు కానీ, రెండు టీకాలు వేసుకున్న రిపోర్టు కానీ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. లేదంటే 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి. దీంతో దీనిబారి నుంచి తప్పించుకునేందుకు నాటు పడవల ద్వారా ఒడిశా చేరుకోవాలని వీరు నిర్ణయించారు.

రాత్రి సీలేరు నది వద్దకు చేరుకుని తమ గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు రెండు పడవలు పంపడంతో తొలి విడతలో 17 మంది సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత ఒక పడవలో 11 మంది మరో పడవలో ఏడుగురు కలిసి మొత్తం 18 మందితో పడవలు బయలుదేరాయి.

పడవలు నది మధ్యలోకి చేరుకున్న తర్వాత ముందు వెళ్తున్న పడవలో నీళ్లు చేరాయి. దీంతో భయపడి రెండో పడవలోకి వచ్చే  ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన రెండు పడవలు నీట మునిగాయి. దీంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. మునిగిన వారిలో 10 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా మరో 8 మంది గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మరణించిన ఐదుగురు చిన్నారుల వయసు 6 ఏళ్ల లోపే కావడం గమనార్హం. మరో మహిళ వయసు 23 సంవత్సరాలు.

More Telugu News