Team India: ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత పురుషుల, మహిళల జట్లకు క్వారంటైన్

  • వచ్చే నెల నుంచి ఇంగ్లండ్ లో టీమిండియా పర్యటన
  • పలు సిరీస్ లు ఆడనున్న భారత పురుష, మహిళా జట్లు
  • ముంబయిలో ముందస్తు క్వారంటైన్
  • 8 రోజుల పాటు కఠినంగా క్వారంటైన్
  • జూన్ 2న ఇంగ్లండ్ పయనం
Quarantine for Indian men and women teams ahead of England tour

భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పురుష, మహిళా క్రికెటర్లకు ముంబయిలో క్వారంటైన్ ఏర్పాటు చేశారు. వీరికి 8 రోజుల పాటు కఠిన క్వారంటైన్ నిబంధనలు అమలు చేయనున్నారు. టీమిండియా పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి నేడు టీమిండియా బయోబబుల్ లోకి ప్రవేశించారు. ఐపీఎల్ లో కరోనా బారినపడిన వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ్ కృష్ణ పూర్తిగా కోలుకోవడంతో, రెండ్రోజుల కిందటే బయోబబుల్ లో చేరారు.

అటు, మహిళల జట్టుకు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని గ్రాండ్ హయత్ హోటల్ లో క్వారంటైన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భారత పురుషుల, మహిళల జట్ల ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి మూడు పర్యాయాలు కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మూడింట్లోనూ నెగెటివ్ వచ్చిన వారినే ఇంగ్లండ్ పంపిస్తారు. జూన్ 2న భారత జట్లు ఇంగ్లండ్ పయనం అవుతాయని భావిస్తున్నారు.

కోహ్లీ నాయకత్వంలోని పురుషుల జట్టు జూన్ 18న న్యూజిలాండ్ తో సౌతాంప్టన్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆపై, ఇంగ్లండ్ తో వారి సొంతగడ్డపైనే 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తలపడనుంది. ఇక మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఒక టెస్టు, 3 వన్డేలు, పలు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.

More Telugu News