CJI Ramana: సీబీఐ డైరెక్టర్ నియామకానికి కొత్త రూల్ లేవనెత్తిన సీజేఐ ఎన్వీ రమణ.. కేంద్ర ప్రభుత్వానికి చిక్కు!

  • ఆరు నెలల రూల్ ను ప్రస్తావించిన సీజేఐ ఎన్వీ రమణ
  • ఆరు నెలలలోపు సర్వీసు వున్న వారు పోలీస్ చీఫ్ పదవికి అనర్హులని స్పష్టీకరణ
  • ఎన్వీ రమణ వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడిన కేంద్ర ప్రభుత్వం
CJI NV Ramana Cited Rule That Eliminated Government Choices For CBI Chief

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదుపరి చీఫ్ ను నియమించేందుకు నిన్న ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి కమిటీ భేటీ అయింది. ఈ కమిటీలో ప్రధానితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి (కాంగ్రెస్) సభ్యులుగా ఉన్నారు. అయితే ఎన్డీటీవీ  కథనం ప్రకారం.. సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఒక కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. 'ఆరు నెలల రూల్' ను సీజేఐ ఈ భేటీలో ప్రస్తావించారు.

ఈ నిబంధన ప్రకారం, ఆరు నెలల లోపు సర్వీసు మిగిలి వున్న వారు పోలీస్ చీఫ్ పదవులకు అనర్హులని సీజేఐ రమణ తెలిపారు. ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే ఈ మేరకు తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు. ఆ నిబంధనను ఇప్పుడు కూడా సెలెక్షన్ ప్యానెల్ కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. సీజేఐ లేవనెత్తిన ఈ పాయింట్ కు అధిర్ రంజన్ చౌధురి మద్దతు పలికారు.

సీబీఐ డైరెక్టర్ పదవి కోసం 1984-87 మధ్య బ్యాచ్ లకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు మొత్తం 109 పరిశీలనలోకి వచ్చాయి. నిన్న మధ్యాహ్నం 1 గంటకు వీరిలో 10 మంది రేసులో నిలిచారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆరుగురిని షార్ట్ లిస్ట్ చేశారు.

ప్రస్తుతం రేసులో ముందు వరుసలో మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైశ్వాల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సశాస్త్ర సీమా బల్ కేఆర్ చంద్ర, కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ వీఎస్కే కౌముది ఉన్నారు. వీరిలో సుబోధ్ కుమార్ అత్యంత సీనియర్ కావడం గమనార్హం. ఈయననే తదుపరి సీబీఐ చీఫ్ గా నియమించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

మరోవైపు, బీఎస్ఎప్ చీఫ్ గా ఉన్న రాకేశ్ ఆస్థానా (ఆగస్ట్ 31న రిటైర్మెంట్), ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ (మే 31న రిటైర్మెంట్) రేసులో ఉన్నప్పటికీ... సీజేఐ లేవనెత్తిన రూల్ తో వారికి ద్వారాలు మూసుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం వీరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో ఒకరిని సీబీఐ చీఫ్ గా నియమించాలని భావించినట్లు సమాచారం. అయితే, ఆరు నెలల రూల్ వీరికి ప్రతిబంధకంగా మారింది.

మరోవైపు భేటీ సందర్భంగా అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ, సీబీఐ చీఫ్ పదవికి పేర్లను ఎంపిక చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అలసత్వాన్ని ప్రదర్శించిందని అన్నారు. ప్యానల్ మీటింగ్ ముందు రోజే 109 పేర్లలో 16 మందిని తొలగించడం దీనికి నిదర్శనమని చెప్పారు. నిబంధనలను దృష్టిలో పెట్టుకోకుండా అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారని అన్నారు.

More Telugu News