KCR: కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం: అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

CM KCR reviews corona situations in state
  • కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • ఓవైపు జ్వర సర్వే చేయాలని ఆదేశం
  • మరోవైపు కరోనా పరీక్షలను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టీకరణ
  • హరీశ్ రావు, కేటీఆర్ లకు కూడా ఆదేశాలు
తెలంగాణలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓవైపు ఇంటింటికీ తిరుగుతూ జ్వర సర్వే చేయడం, మరోవైపు కరోనా పరీక్షలను మరింత పెంచుతూ రెండు వైపుల నుంచి కార్యాచరణ ఉద్ధృతం చేయాలని సూచించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లు అందించే కార్యక్రమం మెరుగైన ఫలితాలనిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సర్వేను కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల కోసం పీహెచ్ సీలకు వస్తున్న ప్రతి ఒక్కరికీ నిరాకరించకుండా కరోనా పరీక్షలు చేపట్టాలని స్పష్టం చేశారు. కరోనా పరీక్షలకు ఉపయోగించే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల సంఖ్యను మరింత పెంచాలన్నారు. అవసరమైతే ఉత్పత్తిదారులతో చర్చించి కిట్ల సరఫరా పెంపుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రంలో ప్రత్యేక బెడ్లు, ఔషధాలను వెంటనే సమకూర్చుకోవాలని అధికారులకు తెలిపారు.

అటు, ఆర్థికమంత్రి హరీశ్ రావుకు కూడా లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని సూచనలు చేశారు. లాక్ డౌన్ కారణంగా కొన్ని శాఖల ఖర్చు పెరుగుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొన్ని శాఖల ఖర్చు తగ్గుతోందని, ఆ ఖర్చు తగ్గే శాఖలను గుర్తించి, ఖర్చు పెరిగే అవకాశాలున్న పోలీస్, వైద్య ఆరోగ్యశాఖల బడ్జెట్ పెంచాలని కేసీఆర్ వివరించారు. దీనిపై సమీక్ష నిర్వహించాలని హరీశ్ రావుకు సూచించారు.

ఇక, సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు కూడా ఆదేశాలు జారీ చేశారు. సెకండ్ డోస్ కోసం అనేకమంది ఎదురుచూస్తున్నందున, వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరిపి సరిపడా వ్యాక్సిన్ డోసులను తక్షణమే సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కు దిశానిర్దేశం చేశారు.

.
KCR
Corona Virus
Review
Harish Rao
KTR
Telangana

More Telugu News