CBI Director: తదుపరి సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని నివాసంలో సమావేశం

Modi chaired the meeting to select new CBI director
  • ఫిబ్రవరిలో సీబీఐ డైరెక్టర్ గా పదవీవిరమణ చేసిన ఆర్కే శుక్లా
  • తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డైరెక్టర్ సిన్హా
  • పూర్తిస్థాయి చీఫ్ ను ఎంపిక చేసేందుకు కమిటీ సమావేశం
  • కమిటీ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ
  • సీబీఐ నూతన డైరెక్టర్ రేసులో పలు పేర్లు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తదుపరి డైరెక్టర్ నియామకం కోసం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎంపిక కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా హాజరయ్యారు. సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేసే అత్యున్నత కమిటీకి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ కమిటీలో పార్లమెంటులో విపక్షనేత అధిర్ రంజన్ చౌదరీ కూడా ఉన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరితో సీబీఐ డైరెక్టర్ గా ఆర్కే శుక్లా పదవీకాలం పూర్తికావడంతో సీబీఐలో అత్యంత అనుభవజ్ఞుడైన అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా ఇప్పటివరకు డైరెక్టర్ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే కొత్త డైరెక్టర్ ఎంపిక అనివార్యమైంది.

1984-87 కాలానికి చెందిన నాలుగు అత్యంత సీనియర్ బ్యాచ్ లకు చెందిన ఐపీఎస్ అధికారులను తదుపరి సీబీఐ డైరెక్టర్ పదవి కోసం పరిశీలించనున్నారు. సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపిక కోసం ఈ కమిటీ నాలుగు నెలల కిందటే సమావేశం కావాల్సి ఉన్నా, ఆలస్యం కావడంతో ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చింది.

సీబీఐ కొత్త చీఫ్ రేసులో వైసీ మోదీ (1984 బ్యాచ్ అసోం-మేఘాలయ క్యాడర్), రాకేశ్ ఆస్థానా (బీఎస్ఎఫ్ గుజరాత్ క్యాడర్ డీజీ), ఎస్ఎస్ దేస్వాల్ (ఐటీబీపీ హర్యానా క్యాడర్ డీజీ) ఉన్నారు. వీరే కాకుండా... ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్.సి.అవస్థి (1985 బ్యాచ్), కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరా, ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్, సీఐఎస్ఎఫ్ డీజీ ఎస్కే జైస్వాల్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద 1984-87 బ్యాచ్ లకు చెందిన 100 పేర్లను ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ పరిశీలించనుంది.

సీనియారిటీ, సమగ్రత, అవినీతి కేసుల విచారణలో అనుభవం ఆధారంగా సీబీఐ నూతన డైరెక్టర్ ను ఎంపిక చేయనున్నారు. కొత్తగా ఎంపికైన సీబీఐ డైరెక్టర్ ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
CBI Director
Narendra Modi
Ramana
Committee

More Telugu News