కొవిడ్ పై పోరులో భాగంగా 2000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తున్న బీసీసీఐ

24-05-2021 Mon 15:14
  • భారత్ లో కరోనా కల్లోలం
  • ఆక్సిజన్ కు పెరుగుతున్న డిమాండ్
  • ఉదారంగా స్పందించిన బీసీసీఐ
  • రానున్న నెలల్లో విరివిగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత
BCCI donates oxygen concentrators

దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వేళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఉదారంగా స్పందించింది. కొవిడ్ పై పోరులో భాగంగా 10 లీటర్ల సామర్థ్యం గల 2000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించాలని నిర్ణయించింది. రాబోయే నెలల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దేశవ్యాప్తంగా విరివిగా అందజేయాలని బీసీసీఐ భావిస్తోంది.

దీనిపై బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, కరోనా మహమ్మారిపై వైద్య ఆరోగ్య సిబ్బంది మడమతిప్పని పోరాటం చేస్తోందంటూ కీర్తించారు. ప్రజలను కాపాడడంతో వారు నిజమైన ఫ్రంట్ లైన్ యోధులని కొనియాడారు. కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఈ విపత్కర పరిస్థితుల్లో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు.

అటు, బీసీసీఐ కార్యదర్శి జయ్ షా స్పందిస్తూ, ప్రస్తుతం వైద్య పరికరాలకు తీవ్ర కొరత ఏర్పడిందని, బీసీసీఐ ఆ దిశగా సాయం చేయాలని నిర్ణయించుకుందని తెలిపారు.