Munna: హైవే హత్యల హంతకుడు మున్నా, అతని గ్యాంగుకు ఉరిశిక్ష విధించిన కోర్టు

  • 2008లో సంచలనం సృష్టించిన హైవే హత్యాకాండ
  • ఐరన్ లోడు కోసం డ్రైవర్లు, క్లీనర్లను చంపిన మున్నా గ్యాంగ్
  • ఏడు ఘటనల్లో 13 మంది హత్య
  • మున్నా సహా 12 మందికి ఉరిశిక్ష
  • మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
Death sentence to highway killer Munna and gang

ప్రకాశం జిల్లాలో కొన్నేళ్ల కిందట హైవేపై జరిగిన హత్యలు సంచలనం సృష్టించాయి. లారీ డ్రైవర్లు, క్లీనర్లే లక్ష్యంగా సీరియల్ హత్యలు జరిగాయి. మొత్తం 7 ఘటనల్లో 13 మంది హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు పాల్పడింది మున్నా అతడి గ్యాంగ్ అని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు ముందుకు తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఒంగోలులోని 8వ అదనపు సెషన్స్ కోర్టు మున్నా, అతడి గ్యాంగ్ కు ఉరిశిక్షలు విధించింది. ఇందులో ప్రధాన ముద్దాయి మున్నా, అతడికి సహకరించిన 11 మందికి ఉరిశిక్ష విధించింది. మరో ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.

ప్రకాశం-నెల్లూరు జిల్లా మధ్య హైవేపై మున్నా గ్యాంగ్ సాగించిన మారణకాండ ఒళ్లు గగుర్పొడిచేలా, ఓ క్రైమ్ సినిమాకు తీసిపోని విధంగా ఉంది. ఐరన్ లోడుతో వెళ్లే లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లను చంపడం... ఆపై ఐరన్ లోడుతో పరారవడం ఈ ముఠా ఘాతుకాల్లో ప్రధానమైనది. ఐరన్ లోడు అమ్మేశాక, లారీలను తుక్కు కింద విడగొట్టి ఆ భాగాలను కూడా విక్రయించేవారు.

వీరు దాడి చేసే విధానం పక్కా ప్లాన్ ప్రకారం జరిగేది. హైవేపై వాహనాలు తనిఖీ చేస్తున్నట్టుగా లారీలను ఆపేవారు. మున్నా అధికారి వేషంలో ఉండగా, అతడి పక్కన ఓ వ్యక్తి గన్ మన్ గా మెషీన్ గన్ చేతబట్టి ఉండడంతో వారు నిజంగానే అధికారులని భావించి లారీ డ్రైవర్లు తమ వాహనాలు ఆపేవారు. చెక్ చేయాలనే నెపంతో లారీ డ్రైవర్లు, క్లీనర్ల గొంతుకలకు తాడు బిగించి దారుణంగా హత్య చేసేవారు. తాము చంపిన డ్రైవర్లు, క్లీనర్ల శవాలను గోతాల్లో కుక్కి హైవే పక్కనే వాగుల్లో పూడ్చిపెట్టేవారు. దోపిడీ చేసిన ఐరన్ లోడును గుంటూరులో అమ్మేవారు.

తమిళనాడుకు చెందిన ఒక లారీ యజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మున్నా గ్యాంగ్ ఆటకట్టించారు. పాత ఇనుమును కొనే వ్యాపారులపై దృష్టి పెట్టి, మున్నా కదలికలు గుర్తించారు. ఓ దశలో దేశం వదిలి పారిపోవాలన్న ప్రయత్నంలో ఉన్న మున్నాను కర్ణాటకలో ఓ ఫాంహౌస్ వద్ద అరెస్ట్ చేశారు. ఆ ఫాంహౌస్ ఓ మాజీ ఎమ్మెల్యేది.

More Telugu News