Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు విడుదలలో జాప్యం.. మరో నాలుగు రోజులు ఆగాల్సిందే!

  • రఘురాజు డిశ్చార్జి సమరీని కోరిన సీఐడీ కోర్టు
  • మరో నాలుగు రోజులు చికిత్స అవసరమన్న ఆర్మీ ఆసుపత్రి వైద్యులు
  • అప్పుడు మరోసారి ష్యూరిటీ పిటిషన్ వేస్తామన్న న్యాయవాది
Raghu Rama Krishna Raju discharge delayed

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పై విడుదలయ్యే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. విడుదలకు మరో నాలుగు రోజులు వేచి ఉండక తప్పదని ఆయన తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్న రఘురాజు ఆరోగ్య పరిస్థితి గురించి మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమరీని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో, రఘురాజుకు మరో నాలుగు రోజుల పాటు వైద్యం అవసరమని మేజిస్ట్రేట్ కు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఈనెల 21న రఘురాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఈరోజు ఆయనను విడుదల చేసే అవకాశం ఉండటంతో... ఆయన తరపు న్యాయవాదులు సీఐడీ కోర్టుకు వెళ్లారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘురాజును నేరుగా విడుదల చేసేందుకు అనుమతించాలని కోర్టును కోరారు.

అయితే, రఘురాజుకు మరో నాలుగు రోజులు చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో... ఆయన విడుదల ప్రక్రియ మరో నాలుగు రోజుల పాటు ఆలస్యం కానుంది. నాలుగు రోజుల తర్వాత సీఐడీ కోర్టులో మరోసారి ష్యూరిటీ పిటిషన్ వేస్తామని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.

More Telugu News