Jagan: జగన్ తన అసమర్థతను ప్రైవేటు ఆసుపత్రులపైకి నెట్టేస్తున్నారు: నిమ్మల

  • కమీషన్లు రావు కాబట్టి టీకాలు కొనడం మానుకున్నారా?
  • జగన్ అప్పుడెందుకు ఆర్డర్ పెట్టలేదు?
  • రూ. 500 కోట్లు కేటాయించినప్పుడే ప్రజలపై మీకున్న ప్రేమ బయటపడింది!
Nimmala Rama Naidu Fires on Jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రులకు కేంద్రం 5 శాతం మాత్రమే టీకాలు కేటాయించిందని, అయినప్పటికీ జగన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులపై నెపం మోపుతున్నారని మండిపడ్డారు.

ఎలాగూ కమీషన్లు రావు కదా అనే ఉద్దేశంతో టీకాలు కొనడాన్ని మానుకున్నారా? అని ప్రశ్నించారు. ఉత్తుత్తి లేఖలతో ప్రజల ప్రాణాలను కాపాడలేరన్న విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. టీకా తయారీ సంస్థల నుంచి రాష్ట్రాలే నేరుగా కొనుగోలు చేసుకోవాలని చెప్పినప్పుడు జగన్ ఏం చేశారని నిలదీశారు. 45 శాతం టీకాలను కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం చెప్పినప్పుడు జగన్ ఆర్డర్ ఎందుకు పెట్టలేదన్నారు.

18-45 ఏళ్ల లోపు వారికి టీకాలు ఇచ్చేందుకు రూ. 1600 కోట్లు అవుతుందని, అయితే మంత్రి వర్గ సమావేశంలో మాత్రం రూ. 45 కోట్లు మాత్రమే కేటాయించాలని నిర్ణయించారని విమర్శించారు. ఆ తర్వాత బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించినప్పుడే ప్రజలకు టీకాలు ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏమిటో బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలన్నీ ముందుగానే మేలుకుని ఆర్డర్లు పెట్టి డబ్బులు కూడా చెల్లిస్తే, జగన్ మాత్రం మొద్దు నిద్రపోయారని నిమ్మల ధ్వజమెత్తారు.

More Telugu News