Siddhartha: ప్రేమించాడని హత్య చేశారు... కరోనాతో పోయాడని నమ్మించే ప్రయత్నం!

  • నిజామాబాద్ జిల్లాలో ఘటన
  • ఓ యువతితో ప్రేమలో పడిన సిద్థార్థ
  • అమ్మాయి బంధువుల్లో ఆగ్రహజ్వాలలు
  • సిద్ధార్థకు వార్నింగ్
  • లెక్కచేయకపోవడంతో తీవ్రస్థాయిలో దాడి
Youth killed by men for love affair with their kin

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ బంధువుల అమ్మాయిని ప్రేమించాడని ఓ యువకుడ్ని కొట్టి చంపి, ఆపై కరోనాతో పోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయారు. కమ్మరపల్లి మండలం హాసాకొత్తూరుకు చెందిన మాలావత్ సిద్ధార్థ (17) ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి స్థానిక రాజకీయనేత రాజేశ్ కు బంధువు. వీరి ప్రేమ వ్యవహారం రాజేశ్ కు తెలియడంతో తన మిత్రులతో కలిసి సిద్ధార్థకు వార్నింగ్ ఇచ్చాడు. సిద్ధార్థ కుటుంబ సభ్యులను కూడా రాజేశ్ బెదిరించాడు.

అయినప్పటికీ సిద్థార్థ ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. మరింత జోరుగా చాటింగ్ లు, ముచ్చట్లతో లవ్ అఫైర్ ను ముందుకు తీసుకెళ్లాడు. దాంతో రగిలిపోయిన రాజేశ్ ఈ నెల 19న తన మిత్రులతో కలిసి సిద్ధార్థపై దాడికి ప్రయత్నించినా, ఆ పథకం విఫలమైంది. ఈసారి సిద్ధార్థ స్నేహితుడు బాలాగౌడ్ ను పావుగా ఉపయోగించుకున్నారు. అతడి సాయంతో సిద్ధార్థను పిలిపించారు. అతడు రాగానే, తమ బైకులపై అతడిని మెట్ల చిట్టాపూర్ తీసుకెళ్లి కర్రలతో దాడి చేశారు.

తీవ్రగాయాలపాలైన సిద్ధార్థను తిరిగి గ్రామంలోకి తీసుకువచ్చారు. అయితే అతడిని ఇంటికి పంపిస్తే తమ దాడి విషయం బట్టబయలవుతుందని గ్రహించి... బాలాగౌడ్ ఇంటి వద్దే ఉంచారు. అయితే, తీవ్రగాయాలు తగిలిన సిద్ధార్థ అర్థరాత్రి తర్వాత మరణించాడు. అతడిని రాజేశ్, బాలాగౌడ్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి చేరేలోపే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

దాంతో రాజేశ్ ముందే వేసుకున్న ప్లాన్ ను అమలు చేశాడు. సిద్ధార్థ కరోనాతో మరణించాడని గ్రామంలో ఓ ఆర్ఎంపీతో ప్రచారం చేయించాడు. అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని గ్రామ ఉప సర్పంచి రాజేశ్వర్ కు సమాచారం అందించారు. అయితే, సిద్ధార్థ కుటుంబ సభ్యులకు ఈ వ్యవహారంపై అనుమానం కలిగింది. సిద్ధార్థ మృతదేహంపై తీవ్ర గాయాలు ఉండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

తీవ్ర ఉద్రిక్తతల నడుమ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్ తదితరులను అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు జరుపుతున్నారు. పోలీస్ స్టేషన్లో నిందితులకు అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయన్న సమాచారంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి, రాజేశ్ ఇంటిపై దాడి చేశారు.

More Telugu News