China: చైనాకు అతి చిన్న దేశం షాక్​!

  • 17+1 యూరప్ కూటమి నుంచి వైదొలిగిన లిథువేనియా
  • తమపై చైనా గూఢచర్యం చేస్తోందని ఆందోళన
  • యూరప్ దేశాలు కలిసికట్టుగా ఉండాలని పిలుపు
Small European Nation Lithuania Shocks China

అది అతి చిన్న దేశం లిథువేనియా. జనాభా తిప్పితిప్పికొడితే 28 లక్షలు కూడా లేదు. అలాంటి దేశం ఇప్పుడు చైనాపై తిరగబడింది. నువ్వెంత అనేంత స్థాయికి వచ్చింది. దానికి కారణమేంటి? అంటే.. చైనా సంగతి తెలియని వారెవరుంటారు! ఆ విషయం ఈ మధ్యే లిథువేనియాకు తెలిసొచ్చింది. స్నేహంగా మెలుగుతూనే గూఢచర్యం చేస్తోందని గుర్తించింది.

ఇప్పుడు కరోనా మహమ్మారి సమయంలోనూ గూఢచర్యం చేస్తోందని, దాని వల్ల తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని లిథువేనియా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే మధ్య, తూర్పు యూరప్ దేశాలతో చైనా ఏర్పాటు చేసిన 17+1 కూటమి నుంచి వైదొలిగింది. యూరప్ దేశాలన్నీ చైనా విషయంలో కలసికట్టుగా ఉండాలని సూచించింది.

ఐరోపా దేశాలను ఆ గ్రూపు విభజిస్తోందని, కాబట్టి ఆయా దేశాలన్నీ 27+1 కూటమినే అనుసరించాలని లిథువేనియా విదేశాంగ మంత్రి గేబ్రియల్ లండ్స్ బర్గ్ అన్నారు. అన్నీ ఆలోచించాకే తాము 17+1 నుంచి బయటకు వచ్చామని చెప్పారు. 2019లోనే తమపై చైనా గూఢచర్యం చేస్తున్నట్టు గుర్తించామని, చైనీస్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సర్వీసెస్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తేలిందని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన జాతీయ ముప్పు నివేదిక అంచనాలోనూ ఇదే విషయాన్ని లిథువేనియా ప్రస్తావించింది.

More Telugu News