Nepal: నేపాల్‌లో మరోమారు రాజకీయ సంక్షోభం.. పార్లమెంటు రద్దు

Nepals President dissolves House election in November
  • ఐదు నెలల్లో రెండోసారి రద్దు అయిన నేపాల్ పార్లమెంటు
  • నవంబరు 12, 19వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం
  • బిద్యాదేవి నిర్ణయంపై మండిపడుతున్న విపక్షాలు
పొరుగు దేశం నేపాల్ మరోమారు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ప్రకటించారు. ప్రధాని కేపీ శర్మ ఓలి కానీ, ఇటు ప్రతిపక్ష కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో బిద్యాదేవి ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది నవంబరు 12, 19వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, నేపాల్ పార్లమెంటు రద్దు కావడం ఐదు నెలల్లో ఇది రెండోసారి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షురాలు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. ప్రధాని కేపీశర్మ ఓలి కానీ, ప్రతిపక్ష నేత షేర్ బహదూర్ దేవ్‌బా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందు రాలేదు. దీంతో గురువారం అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైన కేబినెట్ పార్లమెంటును రద్దు చేయాలని ప్రతిపాదించింది.

పార్లమెంటును రద్దు చేసిన బిద్యాదేవి నవంబరు 12న తొలి దశ, 19న రెండో విడత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. కాగా, పార్లమెంటును రద్దు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓలీ-భండారీ ద్వయం నిరంకుశ, ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని నిర్ణయించాయి. అధ్యక్షురాలి నిర్ణయం ఏకపక్షమని ఆరోపించాయి.
Nepal
Parliament
KP Sharma Oli
Bidya Devi Bhandari

More Telugu News