MK Stalin: తమిళ సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

  • సీఎం ఇంట్లో పెట్టిన బాంబు మరి కాసేపట్లో పేలబోతోందని ఫోన్
  • పరుగులు తీసిన పోలీసులు
  • ఫేక్ కాల్ అని తేల్చేసిన వైనం
  • నిందితుడు మతిస్థిమితం కోల్పోయినట్టు నిర్దారణ
  • హెచ్చరించి వదిలేసిన పోలీసులు
Hoax bomb threat at CM Stalins residence traced to mentally ill caller

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న ఉదయం 10 గంటల సమయంలో ఎగ్మూరులోని పోలీస్ కంట్రోల్ రూముకు ఫోన్ చేసిన ఆగంతకుడు స్టాలిన్ ఇంటిని పేల్చేయబోతున్నట్టు చెప్పాడు. అల్వార్‌పేట చిత్తరంజన్ వీధిలోని ముఖ్యమంత్రి ఇంటిలో బాంబు పెట్టినట్టు చెప్పాడు. మరికాసేపట్లో బాంబు పేలబోతోందని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

ఫోన్ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ నిపుణులు, జాగిలంతో సీఎం ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించకపోవడంతో ఫేక్ కాల్ అని నిర్ధారించారు. ఫోన్‌కాల్ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఫోన్ కాల్ విల్లుపురం జిల్లా మరక్కాణం నుంచి వచ్చిదని, భువనేశ్వర్ (26) అనే యువకుడు ఫోన్ చేసినట్టు గుర్తించారు.

అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతడు మతిస్థిమితం కోల్పోయినట్టు గుర్తించారు. తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించి వదిలేశారు. భువనేశ్వర్ గతంలో అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం, సినీనటులు రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌ తదితరుల ఇళ్లలోనూ బాంబు పెట్టినట్టు ఫోన్ చేసి పోలీసులను హడలెత్తించాడు.

More Telugu News