Anandayya: ఆనందయ్య ఇచ్చేది నాటుమందు: రాష్ట్ర ఆయుష్ కమిషనర్ కర్నల్ రాములు

Anandayya medicine is not Ayurveda it is country medicine
  • దానిని వాడాలా? వద్దా? అనేది వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది
  • ఆనందయ్య మందులో హానికారక పదార్థాలు లేవు
  • మా పరిశీలనలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు
  • ఐసీఎంఆర్ బృందం వస్తుందన్న ప్రచారంలో నిజం లేదు
కరోనాకు ఆనందయ్య ఇస్తున్నది ఆయుర్వేద మందు కాదని, అది నాటువైద్యమని రాష్ట్ర ఆయుష్ శాఖ తెలిపింది. దీనిని వాడాలా? వద్దా? అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కమిషనర్ కర్నల్ రాములు నేతృత్వంలో రెండు రోజులపాటు కృష్ణపట్నంలో పర్యటించిన వైద్యబృందం ఆనందయ్య మందును పరిశీలించింది. అక్కడికి వెళ్లడానికి ముందే ఆనందయ్య కరోనా మందుకు హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో పరీక్షలు చేయించారు. ఆ ఫలితాలు, ఆనందయ్య ఇచ్చిన వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆనందయ్య ఇచ్చేది నాటు మందుగా గుర్తించినట్టు రాములు తెలిపారు.

ఈ మందులో హానికారక పదార్థాలు లేవని, అయితే, దానిని ఆయుర్వేద మందుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. ఇక్కడి పరిస్థితులపై ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్‌కు కు నివేదిక పంపిస్తామన్నారు. కాగా, ఆనందయ్య ఇచ్చే మందులో పచ్చకర్పూరం, పసుపు, నల్ల జీలకర్ర, వేప చిగురు, మారేడు చిగురు, ఫిరంగి చెక్క, దేవరబంగి వంటి ముడి పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతోపాటు ముళ్ల వంకాయ, తోకమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని చుక్కల మందు రూపంలో కంట్లో వేస్తున్నారు. కాగా, తన పరిశీలనలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని రాములు తెలిపారు. మరోవైపు, ఆనందయ్య మందును పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు వస్తుందన్న వార్తల్లో నిజం లేదని అధికారులు పేర్కొన్నారు.
Anandayya
Nellore District
Krishnapatnam
Ayush
Andhra Pradesh

More Telugu News