దేశంలో కరోనా టీకాల కొరతకు కేంద్రమే కారణం: సీరమ్​ అధికారి

22-05-2021 Sat 13:36
  • సరిపడా లేకుండానే 18 ఏళ్లు నిండినవారికీ టీకాలా?
  • డబ్ల్యూహెచ్ వో విధానాలనూ విస్మరించిందని విమర్శ
  • పెద్ద గుణపాఠం నేర్చుకున్నామని కామెంట్
Centre ignored stock availability WHO guidelines for vaccination says Serum Institute official

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కొవిషీల్డ్ వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాధవ్ అన్నారు. దేశంలోని టీకాల నిల్వను పట్టించుకోలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) విధానాలనూ విస్మరించిందని విమర్శించారు.

హీల్ హెల్త్ అనే సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేందుకు లక్ష్యం పెట్టుకున్నారని, దానికి 60 కోట్ల డోసులు కావాల్సి ఉంటుందని చెప్పారు. దేశంలో సరిపడా వ్యాక్సిన్లు లేకపోయినా 45 ఏళ్లు నిండిన వారందరికీ, ఆ వెంటనే 18 ఏళ్లు నిండిన వారికీ కేంద్రం వ్యాక్సినేషన్ ను మొదలుపెట్టిందన్నారు.

డబ్ల్యూహెచ్ వో సూచించిన విధానాలను పాటించి ఉంటే సమస్య ఇంత జటిలమయ్యేది కాదన్నారు. అదే ఇప్పుడు మనందరం నేర్చుకున్న పెద్ద గుణపాఠమన్నారు. కాగా, ప్రస్తుతం దేశంలో 18.92 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. 4.14 కోట్ల మందికి రెండు డోసుల టీకాలు ఇచ్చారు.