Pfizer: వ్యాక్సిన్ల విషయంలో భారత్​, ఫైజర్​ చర్చలు కొలిక్కి!

  • న్యాయ భద్రత కల్పించాలన్న సంస్థ
  • దానికి కేంద్రం ఒప్పుకుందన్న అధికార వర్గాలు
  • త్వరలోనే అమెరికాకు వెళ్లనున్న విదేశాంగ మంత్రి
  • తాము ఏ మాత్రం తగ్గబోమంటున్న ఫైజర్
India Pfizer Seek To Bridge Dispute Over Vaccine Indemnity

వ్యాక్సిన్ల సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఫైజర్ లు రాజీకి వచ్చినట్టు తెలుస్తోంది. టీకా దుష్ప్రభావంతో మరణించిన వారికి ఇచ్చే పరిహారం విషయంలో తమకు కేంద్ర ప్రభుత్వం నుంచే భద్రత కల్పించాలని ఫైజర్ డిమాండ్ చేస్తోంది. అయితే, దేశంలో ఇప్పటిదాకా ఏ సంస్థకూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయపరమైన భద్రతను ఇవ్వలేదు.

ఫైజర్ మాత్రం తమ డిమాండ్ ను వదులుకోవడంలేదు. ఇప్పటికే చాలా దేశాల ప్రభుత్వాలు తమకు ఇలాంటి హామీ ఇచ్చాయని తేల్చి చెబుతోంది. దీనిపై పరిష్కారం ఓ కొలిక్కి వచ్చిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ త్వరలోనే అమెరికాకు పయనమవుతున్నట్టు సమాచారం.

ఏదో ఒక రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయ సాయం అందిస్తామని ఫైజర్ యాజమాన్యానికి జైశంకర్ చెప్తారని అధికార వర్గాలు అంటున్నాయి. ఇటీవలే న్యాయ భద్రతకు సంబంధించి ప్రభుత్వం, సంస్థ మధ్య చర్చలు జరిగినట్టు చెబుతున్నాయి.

అయితే, భారత ప్రభుత్వంతో ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయని ఫైజర్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అన్ని దేశాలకూ తమ విధానం ఒకటేనని, భారత్ విషయంలోనూ అది అలాగే ఉంటుందని, అందులో ఎలాంటి మార్పూ ఉండబోదని తేల్చి చెప్పారు.

More Telugu News