బీఏ రాజు మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎన్టీఆర్, మహేశ్ బాబు, రాజమౌళి

22-05-2021 Sat 11:16
  • షాక్ కు గురయ్యానన్న ఎన్టీఆర్
  • తమ కుటుంబానికి పెద్ద లోటు అన్న మహేశ్
  • తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అన్న సమంత
Tollywood celebrities pays condolences to BA Raju

సినీ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు గుండెపోటుతో నిన్న అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్ ఆవేదనలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

బీఏ రాజు మరణం తనను షాక్ కు గురి చేసిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పీఆర్వోగా, సినీ జర్నలిస్టుగా ఆయన ఎన్నో సేవలందించారని కొనియాడారు. ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఆయనతో తనకు పరిచయం ఉందని చెప్పారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు.

రాజు గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని మహేశ్ బాబు చెప్పారు. తన చిన్నతనం నుంచి ఆయన తనకు తెలుసని అన్నారు. తమ కుటుంబానికి ఆయన ఎంతో ఆప్తుడని... ఆయనకు తామే ప్రపంచమని చెప్పారు. ఆయన మరణం సినీ పరిశ్రమకే కాకుండా... తమ కుటుంబానికి కూడా పెద్ద లోటు అని అన్నారు.

సమంత మాట్లాడుతూ... తన జీవితంలో బీఏ రాజు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు. తన తొలి ప్రాజెక్ట్ నుంచి ఆయన ఎంతో సపోర్ట్ అందించేవారని తెలిపారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు.

1500 చిత్రాలకు పీఆర్వోగా పని చేసిన వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని రాజమౌళి అన్నారు. ఎంతో మంచి వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని చెప్పారు. ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని అన్నారు.