KTR: దేవుడా ఇవేం పదాలు... కేటీఆర్ ఫన్నీ ట్వీట్ కు అదేస్థాయిలో బదులిచ్చిన శశి థరూర్

  • ట్విట్టర్ లో ఆసక్తికర సంభాషణ
  • కరోనా ఔషధాల పేర్లను ప్రస్తావించిన కేటీఆర్
  • అంతకంటే కఠిన పదాన్ని ట్వీట్ చేసిన థరూర్
  • డిక్షనరీ బయటికి తీయాల్సి వచ్చేట్టుందన్న కేటీఆర్
Funny banter between KTR and Shashi Tharoor

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక ఎప్పుడూ వినని పదాలను కూడా వింటున్నారు. ముఖ్యంగా, కరోనా చికిత్సలో వాడే ఔషధాలు నోరుతిరగనంత కష్టంగా ఉండడం తెలిసిందే. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

పోసాకోనాజోల్, క్రెసెంబా, టోసిలిజుమాబ్, రెమ్ డెసివివర్, బారిసిటినిబ్, ఫ్లావిపిరావిర్, మోల్నుపిరావిర్, లిప్సోమాల్ ఆంఫోటెరెసిన్ వంటి ఔషధాల పేర్లను ఉదహరిస్తూ... ఇలాంటి కఠిన పేర్లను ఔషధాలకు ఎందుకు పెడతారని ప్రశ్నించారు. తర్వాత తనే కొంటెగా స్పందిస్తూ, బహుశా ఇంతటి క్లిష్టమైన పేర్లను ఔషధాలకు పెట్టడంలో శశిథరూర్ పాత్ర ఉండొచ్చని ఫన్నీగా ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆంగ్లంపై ఎంతో పట్టున్న వ్యక్తి. ఇంగ్లీషులో ఎప్పుడూ వినని పదాలను కూడా ఆయన ఉపయోగించడమే కాదు, పలకడానికి నోరు తిరగని పదాలను కూడా ఎలా పలకాలో నేర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో, శశి థరూర్ ను ఉద్దేశిస్తూ కేటీఆర్ చమత్కరించారు. దాంతో థరూర్ కూడా సరదాగా స్పందించారు.

"అందులో తప్పేమీలేదు... అయినా ఇలాంటి విషయాలు మీకెందుకు? నేను చూసుకుంటాగా నాకు వదిలేయండి" అంటూ ట్వీట్ చేశారు. "కరోనిల్, కరోజీరో, గో కరోనా గో అంటూ ఆనందంగా పిలుచుకుంటాను" అని వెల్లడింవచారు. ఈ క్రమంలో థరూర్ తనదైన శైలిలో floccinaucinihilipilification అనే పదాన్ని ప్రయోగించారు.

దాంతో కేటీఆర్ "దేవుడా... ఇప్పుడో డిక్షనరీని బయటికి తీయాల్సి వచ్చేట్టుంది" అని వ్యాఖ్యానించారు. అయితే, "కరోనిల్ అంటూ మీరు ప్రదర్శించిన వెటకారాన్ని బాగా ఇష్టపడుతున్నా"నంటూ కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరోనిల్ అనేది బాబా రాందేవ్ కు చెందిన పతంజలి గ్రూప్ తయారుచేసిన కరోనా చికిత్స ఔషధం కాగా, కరోనా తొలినాళ్లలో గో కరోనా గో అనే నినాదాన్ని బీజేపీ నేతలు ఎక్కువగా ఉపయోగించారు.

More Telugu News