Prabhas: నా కెరీర్ లోనే 'వర్షం' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్: ప్రభాస్

Prabhas shares Ek Mini Katha trailer
  • దర్శకుడు శోభన్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రభాస్
  • శోభన్ కుమారుడు సంతోష్ హీరోగా ఏక్ మినీ కథ
  • ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
  • చిత్ర యూనిట్ కు ప్రభాస్ శుభాకాంక్షలు
యువ హీరో సంతోష్ శోభన్, కావ్యా థాపర్, శ్రద్ధా దాస్ నటించిన చిత్రం ఏక్ మినీ కథ. ఈ చిత్రం త్వరలో అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శించనున్నారు. దీనిపై టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ స్పందించారు.

'వర్షం' సినిమా తన కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని గుర్తుచేసుకున్నారు. వర్షం వంటి చిరస్మరణీయమైన చిత్రాన్ని తనకు అందించిన దర్శకుడు శోభన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడాయన కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా ఏక్ మినీ కథ చిత్రం రూపుదిద్దుకుందని, ఈ చిత్రం ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోందని ప్రభాస్ వెల్లడించారు.

ఈ సందర్భంగా తన స్నేహితులైన యూవీ క్రియేషన్స్ అధినేతలకు, చిత్రబృందం మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని సోషల్ మీడియాలో స్పందించారు. చిత్రం ట్రైలర్ ను తన పోస్టులో పంచుకున్నారు.

కాగా, ఏక్ మినీ కథ చిత్రానికి మేర్లపాక గాంధీ కథ అందించగా కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు. ప్రభాస్ కు వర్షం సినిమాతో కెరీర్ బ్రేక్ అందించిన దర్శకుడు శోభన్ 2008లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Prabhas
Ek Mini Katha
Trailer
Varsham
Shobhan
Santosh

More Telugu News