పన్ను చెల్లింపుదారులకు ఊరట... ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

20-05-2021 Thu 21:36
  • కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
  • వ్యక్తుల ఐటీ రిటర్నుల దాఖలుకు సెప్టెంబరు 30 వరకు పెంపు
  • కంపెనీల ఐటీ రిటర్నుల దాఖలుకు నవంబరు 30 వరకు అవకాశం
  • ఈ-ఫైలింగ్ కోసం కొత్త పోర్టల్
Centre extends income tax returns deadline
కరోనా వ్యాప్తి, తదితర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును మరింత పొడిగించింది. వ్యక్తులు ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు సెప్టెంబరు 30 వరకు, కంపెనీలు ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు నవంబరు 30 వరకు అవకాశం కల్పించింది.

అంతేకాదు, కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం-16 గడువును జూలై 15 వరకు పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్టుల దాఖలుకు అక్టోబరు 31, ట్రాన్స్ ఫర్ ప్రైసింగ్ సర్టిఫికెట్ల దాఖలుకు నవంబరు 30 వరకు గడువు పెంచింది.ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక, ఐటీ రిటర్నుల దాఖలు మరింత సులువుగా జరిగేలా సరికొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ కు కేంద్రం రూపకల్పన చేసింది. పాత పోర్టల్ (www.incometaxindiaefiling.gov.in)కు బదులుగా  ఈ కొత్త పోర్టల్ (www.incometaxgov.in) జూన్ 7 నుంచి అందుబాటులోకి రానుంది. పాత పోర్టల్ జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు అందుబాటులో ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.