ఎన్టీఆర్ తో 'ఉప్పెన' దర్శకుడి ప్రాజెక్టు ఖాయమే!

20-05-2021 Thu 18:16
  • ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్'
  • తదుపరి సినిమా కొరటాలతో
  • లైన్లో ఉన్న ప్రశాంత్ నీల్
  • బుచ్చిబాబు కూడా వెయిటింగ్
Ntr upcoming movie is confirmed Buchi Babu

ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఈ రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఆ తరువాత ప్రాజెక్టును ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని ఎన్టీఆర్ ధ్రువీకరించాడు కూడా. ఇక ఈ నేపథ్యంలోనే 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు ఎంట్రీ ఇచ్చాడు.

సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేసిన బుచ్చిబాబు, ఆయనతో చేయనున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు. 'లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పి ఒక ట్రెండ్ సృష్టిద్దాం సార్' అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉందనే వార్తలు ఇంతకుముందే వచ్చాయి. కానీ చాలామందికి నమ్మకం కలగలేదు. ఇప్పుడు ఆ సందేహానికి బుచ్చిబాబు తెర దింపేశాడు. ఇక ఎన్టీఆర్ తన కమిట్ మెంట్స్ ను పూర్తి చేసేలోగా బుచ్చిబాబు ఏ హీరోతో సెట్స్ పైకి వెళతాడో చూడాలి.