Renu Desai: ఇలాంటివి మీరు ఓటేసిన రాజకీయ నాయకుడ్ని అడగండి: నెటిజన్ కు రేణు దేశాయ్ కౌంటర్

  • కరోనా వేళ చేతనైన సాయం చేస్తున్న రేణు దేశాయ్
  • కరోనా రోగులకు చేయూతగా నిలుస్తున్న వైనం
  • కొందరు దురుసుగా వ్యాఖ్యలు చేస్తున్నారన్న రేణు 
  • ఇలాంటి సందేశాలతో ఇన్ బాక్స్ నిండిపోతోందని వెల్లడి
 Renu Desai fires on angry comments in her inbox

కరోనా సంక్షోభ సమయంలో ప్రముఖ నటి, మరాఠీ దర్శకురాలు రేణు దేశాయ్ తనకు వీలైనంతగా సేవ చేస్తున్నారు. కరోనా రోగుల చికిత్స కోసం తనను సాయం కోరిన వాళ్ల పట్ల స్పందిస్తూ, వారికి తగిన చికిత్స లభించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ అసంతృప్తితో చేసిన వ్యాఖ్యలు రేణు దేశాయ్ లో అసహనాన్ని కలిగించాయి. తొలుత ఆ వ్యక్తి తన తల్లికి కరోనా పాజిటివ్ అని, తగినన్ని ఔషధాలు లేవని వాపోయాడు. మీరు సహాయం చేస్తారన్న ఉద్దేశంతో మీకు సందేశం పంపుతున్నా అని రేణు దేశాయ్ కి పోస్టు చేశాడు.

అయితే కాసేపటికే అతడు మరోలా స్పందించాడు. "మీరు సహాయం చేస్తామంటున్నారు... కానీ ఎక్కడ మేడమ్ మీ సహాయం? డబ్బు ఉన్నవాళ్లనే పట్టించుకుంటారా మేడమ్? మీరు మిడిల్ క్లాస్ వాళ్లను పట్టించుకోరా? మిడిల్ క్లాస్ వాళ్లవి ప్రాణాలు కాదా?" అని ప్రశ్నించాడు. దాంతో రేణు దేశాయ్ కి చిర్రెత్తుకొచ్చింది.

'మీరు ప్రశ్నించడానికి నేనేమీ రాజకీయనేతను కాను. ఇలాంటివన్నీ మీరు ఓటేసిన రాజకీయనాయకుడ్ని అడగండి' అని ఘాటుగా బదులిచ్చారు. "ఓవైపు సాయం చేస్తారా అని అడుగుతారు, మరోవైపు దురుసుగా మాట్లాడుతున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో, సదుద్దేశం దిశగా సాగుతున్న తన లక్ష్యం దెబ్బతింటుందని రేణు వ్యాఖ్యానించారు.

తన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని, గత 10-12 రోజులుగా తనకు చేతనైనంత సాయం చేస్తున్నానని వివరించారు. ఇలాంటి వ్యాఖ్యలతో తన ఇన్ బాక్స్ నిండిపోతోందని పేర్కొన్నారు. ఇలాంటి సందేశాల కారణంగా సాయం కోరేవాళ్ల సందేశాలు మరుగునపడిపోతున్నాయని, ఒకవేళ సాయం కోరుతూ చేసిన సందేశాలను మిస్సయితే మరోసారి మెసేజ్ చేయండి అని రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు.

More Telugu News