Marriage: తాళికట్టు శుభవేళ.. కనిపించకుండా పోయిన వరుడు.. అతిథిని పెళ్లాడిన వధువు!

Kanpur groom disappears from wedding venue after jaimala bride marries a baraati
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
  • వరుడు పారిపోయాడని తెలుసుకుని హతాశురాలైన వధువు
  • పెళ్లి కొచ్చిన అతిథుల్లోని యువకుడితో పెళ్లి తంతు పూర్తి
అతిథులతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. వధూవరులిద్దరూ దండలు కూడా మార్చుకున్నారు. ఇక పెళ్లి తంతు పూర్తికావడమే మిగిలింది. అంతలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లి మండపం నుంచి వరుడు మాయమయ్యాడు. అతడి కోసం వెతికి వేసారిన ఇరు కుటుంబాల సభ్యులు అతడు ఉద్దేశపూర్వకంగానే మాయమయ్యాడని  తెలుసుకున్నారు.

మరోవైపు, మండపంపై ఒంటరిగా మిగిలిన వధువు.. పెళ్లికొచ్చిన అతిథుల్లో ఒకరిని పెళ్లాడడంతో కథ సుఖాంతమైంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు జిల్లా మహారాజ్‌పూర్ పట్టణంలో జరిగిందీ ఘటన. వరుడు కనిపించకుండా వెళ్లిపోవడంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. ఇక్కడి వరకు వచ్చాక పెళ్లి ఆగిపోతే తలవంపులు తప్పవని భావించిన వధువు కుటుంబ సభ్యులు పెళ్లి కొచ్చిన అతిథుల్లో ఎవరైనా తమ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ఆరా తీశారు.

దాంతో, వారిలోంచి ఒక యువకుడు ముందుకొచ్చి తాను సిద్ధమని చెప్పడంతో అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి జరిపించారు. వరుడు మారడం తప్ప మిగతా అంతా సవ్యంగా జరిగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, పెళ్లి తంతు ముగిసిన తర్వాత వరుడు, అతడి కుటుంబ సభ్యులపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Marriage
Uttar Pradesh
Kanpur
Bride
Groom

More Telugu News