vaccination: ఊరటనిచ్చే వార్త.. వచ్చే నెల నుంచి తగ్గనున్న మరణాలు

  • ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇస్తే తగ్గనున్న మరణాలు
  • రోజుకు 25 లక్షల టీకా డోసులు అందించాలంటూ తయారీదారులకు సూచన
  • లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడం ద్వారా వ్యాక్సినేషన్‌ను వేగిరం చేసే యత్నం
corona deaths will decrease from nexst month

దేశంలో రోజు వారీ కేసులు, మరణాల సంఖ్య నానాటికి పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇది కాస్తంత ఊరటనిచ్చే వార్తే. మరో పది రోజుల తర్వాత నుంచి అంటే.. వచ్చే నెల నుంచి కరోనా మరణాల్లో తగ్గుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందితే కరోనా మరణాల్లో తప్పకుండా తగ్గుదల కనిపిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, దేశంలో ఉత్పత్తి అవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల సంఖ్యను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రోజుకు కనీసం 25 లక్షల టీకా డోసులను అందించాలంటూ వాటి తయారీదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్‌డౌన్‌ల విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరుగులు పెట్టించాలని నిర్ణయించారు.

ఇంకోవైపు, టీకా తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. టీకా తీసుకునేందుకు ముందుకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందని చెబుతున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి టీకా ప్రక్రియను పూర్తిచేసి ఆ తర్వాత 18 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, హర్యానాల్లో ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.

More Telugu News